తెలంగాణలో మహిళా సాధికారతను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మహిళల ఆర్థిక, సామాజిక అభివృద్ధిని కేంద్రంగా చేసుకుని మహిళా వారోత్సవాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర సచివాలయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా 8 వేల ఇందిరా గాంధీ స్త్రీ శక్తి భవనాలకు వర్చువల్ విధానంలో శంకుస్థాపన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరేట్లలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో మహిళా సంఘాల సభ్యులతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యక్షంగా మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు.
మహిళా సంఘాలు మరింత బలోపేతం కావడంతో పాటు సమావేశాలు, వ్యాపార కార్యకలాపాలు, స్వయం ఉపాధి కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు ప్రత్యేక వేదికలుగా ఈ స్త్రీ శక్తి భవనాలను నిర్మిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మహిళలు ఆర్థికంగా ఎదగడానికి సహకార రంగంలో భాగస్వామ్యాన్ని పెంచే ఉద్దేశంతో మహిళా సంఘాలకు రాయితీ ప్రాతిపదికన రైస్ మిల్లులు, సూపర్ బజార్లు వంటి అవకాశాలను కేటాయించనున్నట్లు వెల్లడించింది. మహిళలకు వడ్డీ లేని రుణాలు, ఆర్థిక సహాయ కార్యక్రమాల అమలుపై కూడా ప్రభుత్వం కీలక ప్రకటనలు చేసింది.
రాష్ట్రంలో మహిళల మద్దతుతోనే తమ ప్రభుత్వం ఏర్పడిందని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం అమలు చేశామని గుర్తుచేశారు. ఈ పథకంపై కొందరు విమర్శలు చేసినప్పటికీ ప్రభుత్వం వెనక్కి తగ్గలేదని, గత 29 నెలల్లో మహిళల ఉచిత బస్సు ప్రయాణాల కోసం ఆర్టీసీకి రూ.10 వేల కోట్లు చెల్లించామని వెల్లడించారు. ఈ పథకం ద్వారా మహిళలను ప్రజా రవాణా వ్యవస్థలో భాగస్వాములుగా నిలబెట్టామని పేర్కొన్నారు.
మహిళల ఆర్థిక అభివృద్ధికి కొత్త అవకాశాలు కల్పించే దిశగా పెట్రోల్ బంకుల నిర్వహణలో కూడా మహిళా సంఘాలకు ప్రాధాన్యం కల్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. అలాగే ధాన్యం కొనుగోలు సమయంలో ఎదురయ్యే రవాణా, హమాలీ, రైస్ మిల్లుల సమస్యలకు శాశ్వత పరిష్కారంగా భవిష్యత్తులో మహిళా సంఘాలకే రైస్ మిల్లులు కేటాయించే దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మహిళా సంఘాల కోసం ప్రత్యేకంగా లాజిస్టిక్ గోడౌన్లు నిర్మించి వాటిలోనే భవిష్యత్తులో ధాన్యం నిల్వ చేసే విధానాన్ని అమలు చేస్తామని ప్రకటించారు.
అదేవిధంగా మహిళా సంఘాల ఆర్థిక సామర్థ్యాన్ని పెంచేందుకు బ్యాంక్ లింకేజ్ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. మహిళా సంఘాలకు ప్రభుత్వం అందించే ప్రతి సహాయం ఒక అన్నగా ప్రభుత్వం అందించే సారెలాంటిదని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో మహిళా సంఘాల ఆధ్వర్యంలో సూపర్ బజార్లు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వ భూములను నామమాత్రపు అద్దెలతో లీజుకు ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చారు.
మహిళల సాధికారతను సంక్షేమం వరకు పరిమితం చేయకుండా ఆర్థిక స్వావలంబన, వ్యాపార అవకాశాలు, ఉపాధి కల్పన, మౌలిక సదుపాయాల కల్పన దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఈ కార్యక్రమం ద్వారా స్పష్టమవుతోందని రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ALSO READ: రామ్ చరణ్‌కు కొత్త బాడీగార్డ్.. రోజుకు జీతం ఎంతంటే..?