-
జేబు చిల్లు కావడం ఖాయం
-
యువతులతో హనీ ట్రాప్
-
అక్కడకు తీసుకెళ్లి.. చేతిలో భారీగా బిల్లు పెడుతున్న వైనం
-
ఏపీకి చెందిన ఓ మహిళా నేత సూత్రధారి
-
హైదరాబాదులో వెలుగు చూసిన దందా
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్: పబ్ కల్చర్ పెరుగుతోంది. హైదరాబాద్ నగరంలో చెప్పనవసరం లేదు. అందుకే భారీగా పబ్ లు వెలుస్తున్నాయి. అయితే వినోదం పేరుతో భారీగా దందా కొనసాగిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాదులోని ప్రముఖ నైట్ లైఫ్ హబ్ జూబ్లీహిల్స్ లో ఒక దందా వెలుగులోకి వచ్చింది.
ఆన్లైన్ డేటింగ్ యాప్ లు, సోషల్ మీడియా ప్లాట్ఫారం లను ఆయుధాలుగా చేసుకుని.. యువకులకు అందమైన అమ్మాయిలతో ఎరవేసి పబ్ లకు రప్పించడం.. ఆపై కనీసం ఆర్డర్ చేయని వస్తువులకూ వేలకు వేలు బిల్లులు వసూలు చేయడం జరుగుతోంది.
తాజాగా జరిగిన ఒక సంచలన ఘటనతో ఈ హనీ ట్రాప్ బిల్లింగ్ మోసం వెలుగులోకి వచ్చింది. దీని వెనుక ఏపీలో ఒక ప్రముఖ రాజకీయ పార్టీకి చెందిన మహిళ నేత హస్తం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
-
ముందస్తు ప్రణాళికతో..
ఒక వ్యూహం ప్రకారం.. పబ్ లోకి రప్పించేందుకు హనీ డ్రాప్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సదరు పబ్ యాజమాన్యం కొంతమంది కిలాడీ యువతులను ప్రత్యేకంగా కమిషన్ ప్రాతిపదికన నియమించుకుంది. వీరు ఆన్లైన్ డేటింగ్ యాప్ లలో నకిలీ, ఆకర్షణీయమైన ప్రొఫైల్ లతో యువకులకు వల వేస్తారు.
కొద్దిరోజులపాటు చాటింగ్ చేశాక ఈరోజే కలుద్దాం.. డేటింగ్ కు వెళ్దాం అంటూ జూబ్లీహిల్స్ లోని సదరు పబ్ కే రావాలని పట్టుబడతారు. సదరు యువకుడు అక్కడికి చేరగానే.. ముందస్తు ప్రణాళిక ప్రకారం ఖరీదైన డ్రింక్స్, ఫుడ్ ఐటమ్స్ ఆర్డర్ చేసినట్లు డ్రామా ఆడుతారు.
అప్పుడే అసలు కథ మొదలవుతుంది. ఆర్డర్ చేసిన కొద్దిసేపటికే సదరు యువతీ చిన్న పని ఉంది.. ఐదు నిమిషాల్లో వస్తా అని చెప్పి నెమ్మదిగా అక్కడి నుంచి జారుకుంటుంది.
-
బిల్లు చెల్లించకపోతే దౌర్జన్యం..
ఆ యువతి కోసం వేచి చూస్తే యువకుడు చేతిలో సిబ్బంది బిల్లు పెడుతుంటారు. ఏకంగా 40 వేల నుంచి 50 వేల వరకు ఉన్న భారీ బిల్లును అందిస్తుంటారు. బాధితుడు తాము అంతగా ఏమీ తీసుకోలేదని.. ఆ బిల్లు అంత ఎలా వచ్చిందని నిలదీస్తే బౌన్సర్లు, సిబ్బంది చుట్టుముట్టి తీవ్రస్థాయిలో బెదిరింపులకు దిగుతారు.
డబ్బులు కడితేనే బయటకు పంపుతామని.. లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించి ఈ మొత్తాన్ని బలవంతంగా వసూలు చేస్తారు. ఈ దందాలో తీవ్రంగా నష్టపోయిన ఒక బాధితుడు భయపడకుండా జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించడంతో వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో పోలీసులు లోతైన దర్యాప్తు ప్రారంభించారు.
సదరు పబ్ యాజమాన్యం, నిర్వహణ బాధ్యతల వెనుక ఏపీలోని ప్రకాశం జిల్లా కు చెందిన వైసిపి మహిళా నేత ప్రధాన సూత్రధారిగా ఉన్నట్లు తెలుస్తోంది. రాజకీయ అండదండలు పెట్టుకుని హైదరాబాద్ వేదికగా ఈ తరహా దందా నడుపుతున్నారని కోణంలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.
