తెలంగాణలోని వాహనదారులందరికీ రవాణాశాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. ఈ-చలాన్లు, కోర్టు నోటీసులు, ఆర్టీఏకి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని సకాలంలో అందుకోవాలంటే వాహన్ పోర్టల్లో తమ తాజా మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీని వెంటనే అప్డేట్ చేసుకోవాలని సూచించింది.
చాలా మంది వాహనదారులు వాహనం కొనుగోలు సమయంలో ఇచ్చిన పాత మొబైల్ నంబర్ లేదా ఈమెయిల్ ఐడీనే ఇప్పటికీ ఉపయోగిస్తున్నారని అధికారులు గుర్తించారు. కాలక్రమేణా నంబర్లు మారినా, కొత్త ఈమెయిల్ ఐడీలు తీసుకున్నా వాటిని వాహన్ డేటాబేస్లో అప్డేట్ చేయడం జరగడం లేదు. దీంతో ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించిన ఈ-చలాన్లు, ఫిట్నెస్ సర్టిఫికేట్ రిమైండర్లు, ఇన్సూరెన్స్ నోటీసులు, రిజిస్ట్రేషన్ ట్రాన్స్ఫర్ సమాచారం వంటి ముఖ్యమైన మెసేజ్లు పాత వివరాలకు వెళ్లిపోతున్నాయి.
ఈ విషయంలో రవాణాశాఖ ఒక విషయం స్పష్టం చేస్తోంది. వాహన్ పోర్టల్లో నమోదైన కాంటాక్ట్ వివరాలకు పంపిన సమాచారాన్ని చట్టపరంగా అందినట్లుగానే పరిగణిస్తారు. “నోటీసులు రాలేదు”, “పాత నంబర్ పని చేయలేదు” వంటి కారణాలు ఎక్కడా చెల్లవని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఈ నిర్లక్ష్యం కారణంగా పెండింగ్ ఫైన్లు పేరుకుపోయే ప్రమాదం ఉంది. అంతేకాకుండా వాహన బదిలీలు, ఇన్సూరెన్స్ క్లెయిమ్లు, ఫిట్నెస్ రీన్యువల్ వంటి సేవల్లో కూడా ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ సమస్యలను నివారించేందుకు వాహనదారులు వాహన్ అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి, తమ వాహన నంబర్ ద్వారా లాగిన్ అయి మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీని సులభంగా అప్డేట్ చేసుకోవచ్చు. మరింత సౌలభ్యం కోసం రవాణాశాఖ ప్రత్యేక QR కోడ్ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. స్మార్ట్ఫోన్తో కోడ్ను స్కాన్ చేస్తే ప్రక్రియ వేగంగా పూర్తవుతుంది.
డిజిటల్ సేవలను మరింత సమర్థవంతంగా అందించడమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. వాహనదారులు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే తమ వివరాలను సరిచేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. చిన్న అప్డేట్తో పెద్ద సమస్యలను ముందుగానే నివారించవచ్చని సూచించారు.
also read: వర్షాకాలంలో బట్టలకు దుర్వాసన రాకుండా ఎలా చూసుకోవాలి? ఈ సింపుల్ చిట్కాలు ఫాలో అవ్వండి