క్రైం మిర్రర్ : దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి ఘటనలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుతం ఆయనకు ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతుండగా, ఆయన రాసిన సూసైడ్ నోట్ కేసులో ప్రధాన ఆధారంగా మారింది. లేఖలో పేర్కొన్న అంశాల ఆధారంగా పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు వర్గాల సమాచారం ప్రకారం.. ఉదయ్ కృష్ణారెడ్డి రాసిన లేఖలో వ్యక్తిగత సంబంధాలు, మానసిక ఒత్తిడి, మరికొంతమంది వ్యక్తులపై చేసిన ఆరోపణలకు సంబంధించిన అంశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఆరోపణలపై అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది.
సూసైడ్ నోట్‌లో తనతో పాటు శిక్షణ పొందుతున్న ఓ మహిళా ఐపీఎస్ అధికారితో కొంతకాలంగా సన్నిహిత సంబంధం ఉన్నట్లు ఉదయ్ కృష్ణారెడ్డి ప్రస్తావించినట్లు సమాచారం. ఆమె వివాహం అనంతరం కూడా ఈ పరిచయం కొనసాగిందని లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ సంబంధానికి సంబంధించిన డిజిటల్ ఆధారాలు, వీడియోలు తన మొబైల్ ఫోన్‌లో ఉన్నాయని, అవి దర్యాప్తుకు ఉపయోగపడతాయని ఆయన లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. సంబంధిత విషయాలను ఆమె భర్తకు కూడా తెలియజేసినట్లు లేఖలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో తన పరిస్థితికి మరో నలుగురు వ్యక్తులు కారణమని ఉదయ్ కృష్ణారెడ్డి ఆరోపించినట్లు సమాచారం. అయితే ఆ నలుగురు ఎవరు? వారితో తనకు ఎలాంటి సంబంధం ఉంది? అనే విషయాలపై పోలీసులు విచారణ చేపట్టారు.
సూసైడ్ నోట్ లభ్యమైన నేపథ్యంలో పోలీసులు ఆయన మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరిశీలనకు పంపించినట్లు సమాచారం. ఫోన్‌లోని డేటా, ఇతర డిజిటల్ ఆధారాలను విశ్లేషించి వాస్తవాలను వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఉదయ్ కృష్ణారెడ్డికి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు దర్యాప్తు పూర్తయిన తర్వాతే స్పష్టమయ్యే అవకాశం ఉంది.
also read : వరుస ఇంటి చోరీల కేసు ఛేదన.. అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్..