క్రైమ్ మిర్రర్ : రాజస్థాన్‌లో రైల్వే ట్రాక్‌పై జరిగిన పేలుడు ఘటనకు సంబంధించి పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. వీరిలో ఓ మహిళతో పాటు మరో వ్యక్తి ఉన్నారు. నిందితురాలి వద్ద నుంచి రెండు ఆయుధాలు, 46 కాట్రిడ్జ్‌లు, రూ.30 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల ప్రాథమిక విచారణలో ఆమెకు పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తులతో సంబంధాలు ఉన్నట్లు వెల్లడైంది.
నవంబర్ 3వ తేదీ రాత్రి 9.45 గంటల సమయంలో రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్ జిల్లా రామ్‌సింగ్‌పూర్ సమీపంలో రైల్వే పట్టాలపై పేలుడు సంభవించింది. ఈ ఘటనలో రెండు రైల్వే స్లీపర్లు దెబ్బతినడంతో పాటు పట్టాల వద్ద సుమారు రెండున్నర అడుగుల లోతులో గొయ్యి ఏర్పడింది. అయితే పేలుడు జరగడానికి 75 నిమిషాల ముందే అనూప్‌గఢ్-సూరత్‌గఢ్ ప్యాసింజర్ రైలు అదే మార్గంలో ప్రయాణించింది. దీంతో ఆ రైలును లక్ష్యంగా చేసుకుని పేలుడుకు కుట్ర పన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
రాజస్థాన్ ఉగ్రవాద నిరోధక దళం (ఏటీఎస్), శ్రీగంగానగర్ పోలీసులు, పంజాబ్ పోలీసులు సంయుక్తంగా విచారణ చేపట్టారు. ఈ క్రమంలో పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తులతో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్న 21 ఏళ్ల మహక్‌దీప్ కౌర్‌తో పాటు ఆమెకు సహకరించిన 22 ఏళ్ల దవీందర్ సింగ్‌ను పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాలో అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం.. కౌర్ భర్త మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసులో జైలులో ఉండగా, అతడి నుంచి విడిపోయి ఆమె వేరుగా నివసిస్తోంది. ఈ క్రమంలో పాకిస్థాన్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులతో ఆమెకు పరిచయం ఏర్పడినట్లు విచారణలో గుర్తించారు. వారిని ‘చాచా’, ‘షా’ అనే పేర్లతో పిలిచేదని పోలీసులు వెల్లడించారు.
పాక్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐతో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్న హ్యాండ్లర్లు ప్రేమపూర్వక సంభాషణలతో కౌర్‌కు దగ్గరై, ఆమెను తమ వైపు తిప్పుకున్నట్లు పోలీసు అధికారి తెలిపారు. రైల్వే ట్రాక్‌పై పేలుడు జరిపేందుకు ఆమెకు డబ్బులు అందించినట్లు విచారణలో వెల్లడైందని పేర్కొన్నారు. నిందితురాలి నుంచి రెండు ఆయుధాలు, 46 కాట్రిడ్జ్‌లు, రూ.30 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ఈ ఘటనలో నిందితులకు ఆశ్రయం కల్పించడం, ద్విచక్ర వాహనం సమకూర్చడం, పేలుడు జరిగిన ప్రాంతానికి చేరుకునేందుకు రవాణా సదుపాయం కల్పించడం వంటి సహాయాలు చేసిన మరో ముగ్గురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.
also read : అక్రమ అండాల సేకరణ కేసులో ఒకరు అరెస్టు…!
