Homeక్రైమ్విషాదం!... అమెరికాలో తెలంగాణ యువకుడి అనుమానాస్పద మృతి..

విషాదం!… అమెరికాలో తెలంగాణ యువకుడి అనుమానాస్పద మృతి..

అమెరికాలో తెలంగాణకు చెందిన ఓ యువకుడు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందడం కలకలం రేపింది. ఉన్నత విద్యను పూర్తిచేసి, జీవితంలో స్థిరపడేందుకు ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించిన సమయంలోనే అతడు ప్రాణాలు కోల్పోవడం కుటుంబసభ్యులను తీవ్ర విషాదంలోకి నెట్టింది.

వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల జిల్లా మల్యాల మండలం రామన్నపేట గ్రామానికి చెందిన వెల్మ రిషిరెడ్డి (21) అమెరికాలోని ఒహాయో రాష్ట్రంలో నివాసం ఉంటున్నాడు. సుమారు 25 ఏళ్ల క్రితమే అతడి కుటుంబం అమెరికాకు వెళ్లి అక్కడ స్థిరపడింది. ఇటీవలే ఇంజినీరింగ్ విద్యను పూర్తి చేసిన రిషిరెడ్డి, మంచి ఉద్యోగం సంపాదించి భవిష్యత్తులో స్థిరపడాలనే లక్ష్యంతో ప్రయత్నాలు చేస్తున్నాడు.

ఈ క్రమంలో రెండు రోజుల క్రితం ఒహాయోలోని హాస్టల్ గదిలో అతడు విగతజీవిగా కనిపించాడు. గదిలో అపస్మారక స్థితిలో పడి ఉన్న రిషిరెడ్డిని గుర్తించిన స్నేహితులు వెంటనే కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ఎంతో భవిష్యత్తు ఉన్న తమ కుమారుడు అకస్మాత్తుగా మరణించాడన్న వార్త విన్న తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

అయితే రిషిరెడ్డి మృతికి గల అసలు కారణాలు ఇప్పటివరకు వెల్లడికాలేదు. ప్రస్తుతం మృతదేహానికి సంబంధించిన పోస్టుమార్టం ప్రక్రియ కొనసాగుతున్నట్లు సమాచారం. వైద్య నివేదిక అందిన తర్వాతే మరణానికి గల కారణాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

మరోవైపు, రిషిరెడ్డి నాయనమ్మ ఇప్పటికీ రామన్నపేట గ్రామంలోనే నివసిస్తున్నారు. అమెరికాలో యువకుడు మరణించిన విషయం తెలుసుకున్న గ్రామస్తులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. చిన్న వయసులోనే నిండు జీవితం ముగియడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

also read: నల్గొండలో నకిలీ మరణ ధ్రువీకరణ పత్రంతో ఉద్యోగం.. రూ.13 లక్షల డీల్.. 14 మంది అరెస్ట్!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు