Homeక్రైమ్డబ్బు ఆశతో ఘాతుకం.. నాలుగేళ్ల బాలుడిని హత్య చేసి అవయవాల విక్రయానికి యత్నం!

డబ్బు ఆశతో ఘాతుకం.. నాలుగేళ్ల బాలుడిని హత్య చేసి అవయవాల విక్రయానికి యత్నం!

సులభంగా డబ్బు సంపాదించాలనే అత్యాశ ఓ యువకుడిని క్రూరమైన నేరానికి పురిగొల్పింది. అభం శుభం తెలియని నాలుగేళ్ల చిన్నారిని హత్య చేయడమే కాకుండా, అతడి శరీరంలోని అవయవాలను విక్రయించి సొమ్ము చేసుకోవాలని ప్రయత్నించాడు. సోషల్ మీడియాలో చూసిన వీడియోల ప్రభావంతోనే ఈ దారుణానికి పాల్పడినట్లు నిందితుడు పోలీసుల విచారణలో వెల్లడించాడు. ఛత్తీస్‌గఢ్‌లోని జష్‌పూర్ జిల్లాలో వెలుగుచూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

పోలీసుల వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్ జష్‌పూర్ జిల్లా సన్నా పోలీస్ స్టేషన్ పరిధిలోని చల్నీ గొర్రాపథ్ గ్రామానికి చెందిన బసుదేవ్ (27) కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. అయితే వచ్చే ఆదాయం సరిపోవడం లేదనే అసంతృప్తితో సులభంగా ఎక్కువ డబ్బు సంపాదించే మార్గాల కోసం ఇంటర్నెట్‌లో వెతికేవాడు. ఈ క్రమంలో పిల్లల అవయవాలను విక్రయించడం ద్వారా డబ్బు సంపాదించవచ్చనే ఆలోచన అతడిలో కలిగినట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఆలోచనతోనే నవంబర్ 5న తన బంధువుకు చెందిన నాలుగేళ్ల బాలుడు జితేంద్ర రామ్‌ను నిందితుడు మాయమాటలతో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ బాలుడికి మద్యం తాగించి, అనంతరం కత్తితో గొంతు కోసి హత్య చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఆ తర్వాత మృతదేహాన్ని ముక్కలుగా చేసి కొన్ని అవయవాలను వేరు చేసి ప్లాస్టిక్ బకెట్‌లో ఉంచినట్లు పోలీసులు గుర్తించారు.

నేరాన్ని దాచిపెట్టేందుకు బాలుడి మృతదేహాన్ని దుప్పటిలో చుట్టి గోనె సంచిలో పెట్టాడు. అనంతరం సమీపంలోని మొక్కజొన్న తోటలో ఉన్న నీటి గుంతలో పూడ్చిపెట్టాడు. ఇదిలా ఉండగా, నవంబర్ 5 నుంచి కుమారుడు కనిపించకపోవడంతో బాలుడి తండ్రి రామ్‌జీత్ రామ్ పోలీసులను ఆశ్రయించాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆదివారం తోటలోని గుంతలో పాక్షికంగా పూడ్చిపెట్టిన బాలుడి మృతదేహాన్ని గుర్తించారు.

అనుమానంతో బసుదేవ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా, బాలుడిని హత్య చేసినట్లు అంగీకరించాడు. అతడు ఇచ్చిన సమాచారం ఆధారంగా హత్యకు ఉపయోగించిన ఆయుధాలతో పాటు అవయవాలు ఉన్న బకెట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు జష్‌పూర్ ఎస్ఎస్పీ లాల్ ఉమేద్ సింగ్ వెల్లడించారు.

also read: ఢిల్లీని కమ్మేసిన విషవాయువులు.. 400 దాటిన ఏక్యూఐ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు