Homeక్రైమ్దారుణం.. భార్యను కుర్చీకి కట్టేసి పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త

దారుణం.. భార్యను కుర్చీకి కట్టేసి పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త

క్రైమ్ మిర్రర్ : ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. భార్యపై అనుమానంతో ఓ వ్యక్తి ఆమెను అత్యంత దారుణంగా హత్య చేశాడు. జగత్‌పూర్ గ్రామానికి చెందిన సోనమ్ (30)ను భర్త సుఖ్‌బీర్ సింగ్ కుర్చీకి కట్టేసి, పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అనంతరం ఇంటికి కూడా నిప్పు పెట్టి తన ఇద్దరు కుమారులతో కలిసి అక్కడి నుంచి పారిపోయాడు.

స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు సుమారు గంటన్నర సమయం పట్టింది. ఆ తర్వాత ఇంట్లోకి వెళ్లి చూడగా సోనమ్ అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించారు. ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

సోనమ్‌, సుఖ్‌బీర్‌కు 11 ఏళ్ల క్రితం వివాహమైంది. హర్యానాలోని హిసార్‌లో సుఖ్‌బీర్ ప్రైవేటు ఉద్యోగం చేసేవాడు. 15 రోజుల క్రితమే స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. ఈ క్రమంలో తన భార్యకు గ్రామంలోని ఓ యువకుడితో సంబంధం ఉందని అనుమానించడం మొదలుపెట్టాడు. ఆమె ఫోన్‌లో ఆ యువకుడితో మాట్లాడటాన్ని గమనించిన తర్వాత అనుమానం మరింత పెరిగింది. దీంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి.

ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు కొద్ది రోజుల క్రితం గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించారు. ఇకపై ఆ యువకుడితో మాట్లాడనని సోనమ్ హామీ ఇచ్చినట్లు సమాచారం. భర్తతోనే కలిసి జీవిస్తానని కూడా అంగీకరించింది. అయితే, అదే రోజు ఆమెతో సంబంధం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న యువకుడు విషం తాగి ఆస్పత్రిలో చేరాడు. ప్రస్తుతం అతను కోలుకుంటున్నట్లు తెలుస్తోంది.

అయినప్పటికీ దంపతుల మధ్య వివాదం కొనసాగింది. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం సుమారు 7 గంటల సమయంలో సుఖ్‌బీర్ తన భార్యను కుర్చీకి కట్టేసి పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు సమాచారం. మంటలు ఇంటి అంతటా వ్యాపించడంతో సోనమ్ కేకలు విన్న స్థానికులు అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. ఘటన అనంతరం ఇద్దరు పిల్లలతో కలిసి పరారైన సుఖ్‌బీర్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేకంగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
also read : అగ్రరాజ్యంలో తెలుగు యువతి…!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు