తెలంగాణలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. చిల్లర విషయంలో ప్రయాణికురాలితో జరిగిన వివాదం ఓ మహిళా కండక్టర్ ప్రాణాలను బలిగొంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మిట్టగూడెం సమీపంలో గత నెల 25న జరిగిన ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కండక్టర్ గుండ్ల ప్రవళిక (24) చికిత్స పొందుతూ మృతి చెందారు.
వివరాల్లోకి వెళ్తే.. బస్సులో చిల్లర విషయంలో ప్రవళికకు ఓ మహిళా ప్రయాణికురాలికి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన సదరు ప్రయాణికురాలు ప్రవళికను బస్సులో నుంచి కిందకు నెట్టివేసినట్లు సమాచారం. దీంతో ఆమె రోడ్డుపై పడిపోగా, బస్సు టైర్లు కాళ్లపై నుంచి వెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి.
ప్రమాదం జరిగిన వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తీసుకెళ్లగా, అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. 24 ఏళ్ల వయసులోనే ప్రవళిక మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, సహోద్యోగులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
ప్రవళిక మృతికి నిరసనగా బుధవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బస్సుల రాకపోకలను నిలిపివేశారు. కండక్టర్ మృతికి కారణమైన ఘటనపై ఆర్టీసీ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తూ నిరసన చేపట్టారు. విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులకు భద్రత కల్పించాలనే డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చింది.
also read: శివసత్తు హత్య కేసులో సంచలన విషయాలు.. లైంగిక వేధింపులే హత్యకు కారణమా?
