-
వెంటాడుతున్న కొరత
-
అవసరానికి తగ్గట్టు జరగని సరఫరా
-
ఆపై ట్రూ ఆప్ చార్జీల పేరుతో రూ.5420 కోట్ల బాదుడు
-
రేవంత్ సర్కార్ మల్లగుల్లాలు
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణకు కరెంట్ కష్టాలు కొనసాగుతున్నాయి. ఓవైపు విద్యుత్ కొరత వెంటాడుతోంది. మరోవైపు అదనపు బిల్లుల భారం పడుతుంది. ఏకంగా ట్రూ ఆప్ చార్జీల పేరుతో ప్రజలపై రూ.5420 కోట్ల భారం పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. రోజుకు 1982 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఏర్పడడం రేవంత్ సర్కార్‌కు గుదిబండగా మారింది. తెలంగాణ విద్యుత్ సంక్షోభంలో కూరుకు పోతోంది.
మండుతున్న ఎండలు, వర్షాభావ పరిస్థితులు, వ్యవసాయంతో పాటు పారిశ్రామిక రంగంలో పెరిగిన విద్యుత్ అవసరాలు సరఫరా వ్యవస్థ పై పెను ప్రభావం చూపుతున్నాయి. అక్కడక్కడ విద్యుత్ కోతలు, నువ్వు వోల్టేజి సమస్యలపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది.
-
పాత బకాయిల పేరుతో..
సందట్లో సడే మియా అన్నట్టు ఇప్పుడు తెలంగాణ ప్రజలపై ట్రూ ఆప్ చార్జీల భారం పడింది. 2022-23, 2023 -24 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి విద్యుత్ కొనుగోళ్లు, అదనపు వ్యయాలు, ఆదాయ లోటు లో సర్దుబాటులో భాగంగా తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి మొత్తం రూ.7635 కోట్ల ట్రూ ఆఫ్ చార్జీల వసూలుకు అనుమతించినట్లు సమాచారం.
ఇందులో వ్యవసాయ రంగానికి సంబంధించిన రూ.2214 కోట్ల భారాన్ని ప్రభుత్వం భరించనుండగా.. మిగిలిన రూ.5420 కోట్ల వ్యవసాయేతర వినియోగదారుల నుంచి దశలవారీగా వసూలు చేయనున్నారు. ఇప్పటికే ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు అదనపు విద్యుత్ బిల్లుల భారం మరింత భారంగా మారే అవకాశం ఉంది.
-
ప్రజల్లో అసంతృప్తి..
తెలంగాణలో తీవ్ర విద్యుత్ సంక్షోభం నెలకొంది. డిమాండ్ కు తగ్గట్టు సరఫరా కొనసాగడం లేదు. అవసరమైన విద్యుత్‌ను బహిరంగ మార్కెట్ నుంచి కొనుగోలు చేయడంతో పాటు ధర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సరఫరా పై దృష్టి సారిస్తోంది ప్రభుత్వం.
ఎత్తిపోతల పథకాలకు పిక్ అవర్స్ కు బదులుగా ఆఫ్ పీక్ సమయాల్లో విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించడం, నగరాల్లో సబ్ స్టేషన్ల సామర్థ్యాన్ని పెంచడం, గ్రిడ్ల నిర్వహణను మెరుగుపరచడం వంటి చర్యలను అమలు చేయాలని భావిస్తోంది. మరోవైపు విద్యుత్ సమస్యలను అస్త్రంగా చేసుకుని విపక్షాలు విరుచుకుపడుతున్నాయి.
ప్రధానంగా గులాబీ పార్టీ దీనిని ఒక ఉద్యమం దిశగా తీసుకెళ్లాలని భావిస్తోంది. సహజంగానే ఇది అధికార పార్టీలో ఆందోళనకు కారణం అవుతోంది. అందుకే రేవంత్ సర్కార్ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది విద్యుత్ సమస్యలపై. చూడాలి చివరకు ఏం జరుగుతుందో..
