సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకుని రూపొందిస్తున్న డీప్‌ఫేక్, ఏఐ మార్ఫింగ్ వీడియోలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. తాజాగా జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ నటించిన ‘దేవర’ సినిమాలోని ‘చుట్టమల్లె’ పాటకు సంబంధించిన ఓ మార్ఫింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహిళలను కించపరిచే విధంగా కృత్రిమ మేధ (AI) సాంకేతికతను ఉపయోగించడం ఏమాత్రం సమర్థనీయం కాదని ఎన్టీఆర్ పేర్కొన్నారు. మహిళలను గౌరవించడం భారతీయ సంస్కృతిలో ఎంతో ముఖ్యమైన భాగమని, అలాంటి మహిళలను అవమానించే కంటెంట్‌ను రూపొందించేందుకు టెక్నాలజీని ఉపయోగించడం బాధాకరమైన విషయమని అన్నారు.
ఈ వీడియోను రూపొందించిన వారిపైనే కాకుండా.. దాన్ని సోషల్ మీడియా వేదికల్లో ప్రచారం చేస్తున్న వారిపైనా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఎన్టీఆర్ స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలను తేలికగా తీసుకునే ప్రసక్తి లేదని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
అదే సమయంలో వైరల్ అవుతున్న అభ్యంతరకరమైన వీడియోను ఎవరూ చూడవద్దని, ఇతరులకు పంపించవద్దని ఎన్టీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ రోజు మరొక మహిళ ఎదుర్కొంటున్న ఇలాంటి సమస్య రేపు మన కుటుంబంలోని మహిళలకు కూడా ఎదురయ్యే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.
ఏఐ టెక్నాలజీ అందుబాటులోకి రావడం ఒకవైపు అనేక ప్రయోజనాలను అందిస్తున్నప్పటికీ.. దాని దుర్వినియోగం తీవ్రమైన సమస్యలకు దారితీస్తోందని ఎన్టీఆర్ అభిప్రాయపడ్డారు. మహిళలను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి మార్ఫింగ్ కంటెంట్ తయారు కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత కఠినమైన నిబంధనలు తీసుకురావాలని ఆయన కోరారు.
ఏఐ ఆధారిత మార్ఫింగ్, డీప్‌ఫేక్ కంటెంట్‌పై ఎన్టీఆర్ చేసిన ఈ తీవ్ర స్పందన ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. బాధ్యతారహితంగా టెక్నాలజీని ఉపయోగించే వారిపై చర్యలు అవసరమనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
also read: అమెరికాలో హిందూ ఆలయంపై ఇటుకలతో దాడి.. కిటికీలు ధ్వంసం
