క్రైమ్ మిర్రర్ : ఇటీవల భారీ వరదలతో తీవ్రంగా ప్రభావితమైన నేపాల్‌కు మరోసారి వరద ముప్పు పొంచి ఉంది. దేశవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో నదుల్లో నీటిమట్టాలు వేగంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా బాగ్మతి నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో నదీ పరివాహక ప్రాంతాల్లో ఆందోళన నెలకొంది. భారీగా వరద నీరు చేరడంతో బాగ్మతి నది ప్రమాదకర స్థాయికి చేరువైంది. నదికి సమీపంలోని కొన్ని ప్రాంతాల్లోకి ఇప్పటికే నీరు చేరుతున్నట్లు సమాచారం. ప్రవాహం మరింత పెరిగితే లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
భారీ వర్షాల కారణంగా వరదలతో పాటు కొండచరియలు విరిగిపడే ప్రమాదం కూడా ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. రాజధాని ఖాట్మండ్‌ను ఇతర ప్రాంతాలతో అనుసంధానించే పలు ప్రధాన రహదారులపై వరద నీరు చేరింది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పృథ్వీ హైవే, బీపీ హైవే, కాంతి లోక్‌పథ్ వంటి ప్రధాన మార్గాల్లో పలు చోట్ల నీరు నిలిచిపోయింది. కొన్ని ప్రాంతాల్లో కొండచరియలు రహదారులపై పడటంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో పెద్ద సంఖ్యలో వాహనాలు మార్గమధ్యంలోనే నిలిచిపోయాయి.
మరోవైపు రోషి నది కూడా ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వరద ప్రవాహానికి కొన్ని ప్రాంతాల్లో రహదారులు దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని పలు మార్గాల్లో ట్రాఫిక్‌ను దారి మళ్లించారు. సెప్టెంబర్ 25 నుంచి 27 వరకు నేపాల్‌లో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం మరింత పెరిగే అవకాశం ఉంది. నదీ తీరాలు, లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సంబంధిత విభాగాలను ప్రభుత్వం అప్రమత్తం చేసి, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది.
also read : జార్ఖండ్ లో భారీ బ్యాంకు దోపిడీ.. రూ.36 కోట్ల బంగారం, రూ.43 లక్షల నగదు అపహరణ
