-
రంగంలోకి వామపక్షాలు
-
సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ చర్చలు
-
కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతున్న సంకేతాలు
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో : ఇండియా కూటమి వైపు జగన్ అడుగులు వేస్తున్నారు. ఏపీ రాజకీయాల్లో సంక్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్న జగన్ జాతీయస్థాయిలో ఒక తోడు అవసరం అని భావిస్తున్నారు. తీవ్ర ఆలోచనల నడుమ ఆయన ఇండియా కూటమి వైపు అడుగులు వేస్తున్నట్లు అర్థం అవుతుంది. ఏపీలో వామపక్షాలు జగన్మోహన్ రెడ్డిని కలిసి.. తమతో కలిసి రావాలన్న పిలుపు నేపథ్యంలో జగన్ ఆలోచన మారినట్లు అర్థం అవుతోంది. జగన్ అధికారంలో ఉన్నప్పుడు వామపక్షాలు తీవ్రంగా టార్గెట్ చేసుకునేవి. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీని తీవ్రంగా వ్యతిరేకించాయి వామపక్షాలు. అటువంటి లెఫ్ట్ పార్టీలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో కలిసి నడిచేందుకు సిద్ధపడటం వెనుక భారీ వ్యూహం ఉన్నట్లు అర్థమవుతోంది. ఇండియా కూటమిలోకి జగన్మోహన్ రెడ్డిని చేర్పించేందుకు ఈ వ్యూహం అని అర్థం అవుతోంది.
స్పష్టమైన మార్పు…
ఇటీవల జగన్ వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. జాతీయ రాజకీయ వ్యూహంలో వస్తున్న మార్పులు కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాయి. జగన్ ఓడిపోయిన తర్వాత కూడా ఆయన విధానాలను, రాజకీయాలను విమర్శిస్తూ వచ్చారు సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ. అనూహ్యంగా ఆయన తాడేపల్లిలో జగన్ నివాసానికి వెళ్లి చర్చలు జరపడం చర్చనీయాంశమైంది. తమ పార్టీ నిర్వహించే సదస్సుకు హాజరు కావాలంటూ జగన్మోహన్ రెడ్డిని ఆయన ఆహ్వానించడం కేవలం ఒక సాధారణ మర్యాదపూర్వక భేటీ ఎంత మాత్రం కాదు. దీని వెనుక జాతీయ రాజకీయ వ్యూహం దాగి ఉంది. జగన్మోహన్ రెడ్డిని ఇండియా కూటమిలో చేర్చేందుకు.. బిజెపి వైపు ఉన్న ఆ చిన్న బంధాన్ని తొలగించేందుకు వామపక్షాలు రంగంలోకి దిగాయి అనేది ఒక బలమైన వాదన.
గతంలో ఆహ్వానం లేదు…
గతంలో సిపిఐ జాతీయ, రాష్ట్రస్థాయిలో ఎన్నో కీలక సదస్సులు, చర్చ కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ.. వైసీపీని, జగన్మోహన్ రెడ్డిని ఏనాడు భాగస్వామ్యం చేసి ఆహ్వానించిన దాఖలాలు లేవు. అలాంటిది ఇప్పుడు రాత్రికి రాత్రి సిపిఐ వైఖరిలో ఈ మార్పు రావడానికి వెనుక జాతీయస్థాయి ఇండియా కూటమి అగ్ర నేతల స్పష్టమైన సూచనలు ఉన్నాయనేది బహిరంగ రహస్యం. జాతీయస్థాయిలో బిజెపికి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలను ఏకం చేసే క్రమంలో.. ఏపీలో వైసీపీని మెల్లగా కాంగ్రెస్ నాయకత్వంలోని కూటమి వైపునకు తిప్పుకునేందుకు కమ్యూనిస్టులను దూతలుగా వాడుకుంటున్నారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
రాజకీయ రక్షణ కవచంగా…
ప్రస్తుతం ఏపీలో జగన్మోహన్ రెడ్డితో కలిసి వచ్చే పార్టీలు లేవు. అందుకే ఈ తాజా పరిణామాలను తన రాజకీయ రక్షణ కవచంగా, వ్యూహాత్మక ఆయుధంగా మలుచుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. కేంద్రంలోని బిజెపి పెద్దలతో సఖ్యతగా ఉంటూ తనపై ఉన్న కేసులు, ఇతర అంశాల్లో లబ్ధి పొందారు జగన్. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పైగా చంద్రబాబు నేతృత్వంలోని కూటమిక్కి కేంద్ర పెద్దలు సంపూర్ణ సహకారం అందిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో బిజెపిని నమ్ముకోవడం కంటే ప్రత్యామ్నాయం బెటర్ అన్న ఆలోచనకు వచ్చారు. కమ్యూనిస్టులతో వేదికలు పంచుకోవడం ద్వారా అవసరం అనుకుంటే కాంగ్రెస్తో జతకట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్న సంకేతాలు బిజెపికి పంపేందుకు.. ఇలా కొత్త స్నేహం వైపు అడుగులు వేస్తున్నారు అనేది రాజకీయ నిపుణుల అంచనా. చివరికి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది చూడాలి.
ఇవి కూడ చదవండి:
-
దీన్‌దయాళ్ ఆలోచనలే అభివృద్ధికి మార్గదర్శకం.. ప్రధాని మోదీ
-
అంబటి రాంబాబుకు మరోసారి ఈడీ నోటీసులు.. 28న విచారణకు హాజరు కావాలని ఆదేశం
-
రైల్లో నుండి యువకుడిని తోసి హత్య చేసిన కిల్లర్ అరెస్ట్
-
ఈడీ నోటీసులు.. ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి కీలక సమన్లు
