హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి రైలులో వెళ్తున్న 21 ఏళ్ల నితిన్ కుమార్‌ను రైలు నుంచి తోసి హత్య చేసిన కేసులో నకిలీ ఆర్పీఎఫ్ అధికారి రోహిత్ తివారీని వారణాసి పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటన జరిగిన 24 గంటల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. రోహిత్ తివారీ తనను తాను ఆర్పీఎఫ్ అధికారిగా పరిచయం చేసుకుంటూ రైళ్లలో ప్రయాణికుల నుంచి డబ్బులు వసూలు చేసేవాడు. తాను అడిగిన డబ్బులు ఇవ్వని ప్రయాణికులను బెదిరించేవాడని, ఎదురు తిరిగిన వారిపై దాడులకు పాల్పడేవాడని పోలీసులు తెలిపారు.
ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వెళ్తున్న నితిన్ కుమార్‌ను కూడా నిందితుడు డబ్బుల కోసం వేధించినట్లు తెలుస్తోంది. డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించడంతో నితిన్‌ను రైలు నుంచి బయటకు తోసినట్లు పోలీసులు పేర్కొన్నారు. తీవ్ర గాయాలతో నితిన్ మృతి చెందినట్లు తెలిపారు.
కేసు నమోదు చేసుకున్న వారణాసి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. రైల్వే పరిసరాల్లోని సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించి నిందితుడి కదలికలను గుర్తించారు. సాంకేతిక ఆధారాలతో రోహిత్ తివారీని ఘటన జరిగిన 24 గంటల్లోనే అరెస్ట్ చేశారు.
నిందితుడికి గతంలోనూ నేర చరిత్ర ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. గతంలో ఓ కేసులో 25 నెలల పాటు జైలు శిక్ష కూడా అనుభవించినట్లు పోలీసులు తెలిపారు. రైళ్లలో నకిలీ ఆర్పీఎఫ్ అధికారిగా తిరుగుతూ ప్రయాణికుల నుంచి డబ్బులు వసూలు చేసిన ఘటనలపై కూడా దర్యాప్తు కొనసాగుతున్నట్లు వెల్లడించారు.
also read: ఈడీ నోటీసులు.. ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి కీలక సమన్లు
