ఆంధ్రప్రదేశ్ మద్యం రవాణా కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తును కొనసాగిస్తోంది. ఈ కేసుకు సంబంధించి మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుకు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. గతంలో కేటాయించిన విచారణ తేదీకి హాజరు కాలేకపోవడంతో కొత్త తేదీ ఇవ్వాలని ఆయన కోరినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 28న విచారణకు హాజరు కావాలని ఈడీ తాజా నోటీసుల్లో పేర్కొంది.
రాష్ట్రంలో మద్యం రవాణాకు సంబంధించిన కాంట్రాక్టులు, సబ్‌కాంట్రాక్టుల కేటాయింపుల్లో చోటుచేసుకున్నట్లు ఆరోపణలు ఉన్న ఆర్థిక లావాదేవీలపై ఈడీ దృష్టి సారించింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్‌కు చెందిన డిపోల నుంచి ప్రభుత్వ మద్యం దుకాణాలకు మద్యం సరఫరా చేసే రవాణా వ్యవస్థలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఈ కేసు దర్యాప్తు సాగుతోంది.
2020లో జారీ చేసిన కేంద్రీకృత రవాణా టెండర్‌తో పాటు, ఆ తర్వాత కాంట్రాక్టులు మరియు సబ్‌కాంట్రాక్టుల కేటాయింపులపై దర్యాప్తు సంస్థ ప్రధానంగా దృష్టి పెట్టింది. ఈ వ్యవహారానికి సంబంధించి జరిగిన ఆర్థిక లావాదేవీలపై వివరాలను సేకరిస్తున్న ఈడీ.. సంబంధిత వ్యక్తులను విచారిస్తోంది.
ఇదే క్రమంలో అంబటి రాంబాబుకు తాజా నోటీసులు జారీ చేసి ఈ నెల 28న విచారణకు హాజరై తమకు అవసరమైన వివరాలను అందించాలని సూచించింది. ఈ విచారణలో రవాణా కాంట్రాక్టులు, వాటి కేటాయింపు ప్రక్రియ, సంబంధిత ఆర్థిక లావాదేవీలపై ఈడీ అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది.
also read: రైల్లో నుండి యువకుడిని తోసి హత్య చేసిన కిల్లర్ అరెస్ట్
