Homeసినిమాఅజయ్ దేవ్‌గణ్‌కు బీఎంసీ షాక్.. బంగ్లాలో నిర్మాణ పనులు నిలిపివేత

అజయ్ దేవ్‌గణ్‌కు బీఎంసీ షాక్.. బంగ్లాలో నిర్మాణ పనులు నిలిపివేత

బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గణ్‌కు చెందిన ముంబై జుహు బంగ్లాలో జరుగుతున్న నిర్మాణ పనులకు బ్రేక్ పడింది. నివాస ప్రాపర్టీని వాణిజ్య అవసరాలకు ఉపయోగించేందుకు మార్పులు చేస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) అధికారులు స్టాప్-వర్క్ నోటీసు జారీ చేశారు.

జుహులోని జేవీపీడీ స్కీమ్‌లో ఉన్న కాపోల్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో అజయ్ దేవ్‌గణ్‌కు సుమారు 7,802 చదరపు అడుగుల విస్తీర్ణంలో బంగ్లా ఉంది. ఇందులో అత్యాధునిక సెలూన్, స్పా ఏర్పాటు చేసేందుకు నిర్మాణ పనులు చేపట్టినట్లు సమాచారం. అయితే నివాస ప్రాంతంలో వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభిస్తే ఇబ్బందులు తలెత్తుతాయని సొసైటీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

సెలూన్, స్పా కారణంగా బయట నుంచి వచ్చే వారి సంఖ్య పెరుగుతుందని, దాంతో పార్కింగ్, భద్రత, శబ్ద కాలుష్యం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా సొసైటీ పరిధిలోని అంతర్గత రహదారులు ఇరుకుగా ఉండటంతో ట్రాఫిక్ సమస్య కూడా పెరిగే అవకాశం ఉందని పేర్కొంటూ బీఎంసీకి ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదుపై స్పందించిన బీఎంసీ కె-వెస్ట్ వార్డు అధికారులు అజయ్ దేవ్‌గణ్ బంగ్లాను తనిఖీ చేశారు. వాణిజ్య వినియోగానికి సంబంధించిన అనుమతులు, ఇతర అవసరమైన పత్రాలను సమర్పించాలని ప్రాపర్టీ యజమానులను కోరారు. అయితే అధికారులు అడిగిన పత్రాలు సమర్పించకపోవడంతో నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలని ఆదేశిస్తూ స్టాప్-వర్క్ నోటీసు జారీ చేశారు.

ఈ నోటీసుపై స్పందించేందుకు, అవసరమైన వివరణతో పాటు సంబంధిత పత్రాలను సమర్పించేందుకు తమకు నాలుగు వారాల సమయం ఇవ్వాలని దేవ్‌గణ్ కుటుంబం కోరినట్లు సమాచారం.

స్థానిక కార్పొరేటర్ సుధా సింగ్ కూడా ఈ వ్యవహారంపై స్పందించారు. బీఎంసీ బిల్డింగ్ అండ్ ఫ్యాక్టరీ డిపార్ట్‌మెంట్ నిర్వహించిన ప్రాథమిక తనిఖీల్లో ఆ ప్రాంగణానికి వాణిజ్య వినియోగానికి సంబంధించిన అనుమతులు లేవని గుర్తించినట్లు ఆమె తెలిపారు.

ప్రస్తుతం బీఎంసీ ఆదేశాల మేరకు బంగ్లాలోని నిర్మాణ పనులు నిలిచిపోయాయి. దేవ్‌గణ్ కుటుంబం సమర్పించే వివరణ, పత్రాలను పరిశీలించిన తర్వాత తదుపరి చర్యలపై అధికారులు నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

also read: బాలాపూర్ గణేశుడి లడ్డూకు రికార్డు ధర.. రూ.39 లక్షలకు దక్కించుకున్న భక్తుడు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు