హైదరాబాద్ మాదాపూర్‌లో ఓ యువతి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం కలకలం రేపింది. సిద్దిఖీ నగర్‌లోని ఓయో హోటల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రియుడితో కలిసి హోటల్‌కు వెళ్లిన యువతి అక్కడ మృతిచెందగా.. విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే అతడు అక్కడి నుంచి వెళ్లిపోవడం అనుమానాలకు దారితీసింది. ఘటనపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం.. విశాఖపట్నానికి చెందిన షారోన్ నిఖితా టోప్నో తన ప్రియుడు శ్రీనివాస రవితేజతో కలిసి మాదాపూర్‌లోని ఓయో హోటల్లో రూమ్ నంబర్ 303ను బుక్ చేసుకున్నారు. అర్ధరాత్రి సమయంలో రవితేజ హోటల్ సిబ్బందిని సంప్రదించి.. తనతో వచ్చిన నిఖిత అపస్మారక స్థితిలో ఉందని తెలిపాడు. వెంటనే హోటల్ సిబ్బంది సహాయంతో ఆమెను కొండాపూర్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
సమాచారం అందుకున్న మాదాపూర్ పోలీసులు హోటల్‌కు చేరుకుని ఘటనపై విచారణ చేపట్టారు. మృతురాలి ముఖం, తల భాగంలో గాయాలు, వాపులు ఉన్నట్లు గుర్తించారు. దీంతో యువతి మృతిని అనుమానాస్పదంగా పరిగణిస్తూ కేసు నమోదు చేశారు. హోటల్ గదిని పరిశీలించిన సమయంలో గోడలు, బెడ్‌షీట్‌పై రక్తపు మరకలు కనిపించినట్లు పోలీసులు తెలిపారు. అదే సమయంలో గదిలో ఖాళీ బీర్, విస్కీ బాటిళ్లు కూడా లభించాయి.
ఈ పరిస్థితుల నేపథ్యంలో నిఖిత, రవితేజ మధ్య ఏదైనా వివాదం జరిగిందా? ఆ గొడవలోనే ఆమెకు గాయాలయ్యాయా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే యువతి మృతికి అసలు కారణం ఏమిటనేది దర్యాప్తు పూర్తయ్యే వరకు స్పష్టత రావాల్సి ఉంది.
మరోవైపు నిఖిత మృతి చెందిన విషయం తెలియగానే రవితేజ ఆసుపత్రి నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అతని కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. రవితేజ మొబైల్ ఫోన్ సిగ్నల్స్ చివరిసారిగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసరాల్లో నమోదైనట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఆ తర్వాత అతని ఫోన్ స్విచ్ఛాఫ్ అయినట్లు తెలిపారు.
ప్రస్తుతం క్లూస్ టీమ్ హోటల్ గదిలో ఆధారాలను సేకరిస్తోంది. గదిలో లభించిన వస్తువులు, రక్తపు మరకలను పరిశీలించడంతో పాటు హోటల్ పరిసరాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పోలీసులు విశ్లేషిస్తున్నారు. రవితేజ ఆచూకీ లభించిన తర్వాత విచారణలో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
also read: నిమ్స్ డిప్యూటీ సూపరింటెండెంట్ నివాసాలపై ఏసీబీ దాడులు.. 13 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు
