సూర్యాపేట జిల్లాలో విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పిన కారు డివైడర్‌ను ఢీకొన్న అనంతరం మంటలు చెలరేగడంతో ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ కాసకుర్తి జగదీశ్ సజీవదహనమయ్యారు. పిల్లలమర్రి శివారులో హైదరాబాద్-ఖమ్మం జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.
ఖమ్మంలోని మమత ఆసుపత్రిలో న్యూరో సర్జన్‌గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ జగదీశ్ కారులో ఖమ్మం వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో పిల్లలమర్రి సమీపానికి చేరుకోగానే ఆయన ప్రయాణిస్తున్న వాహనం ఒక్కసారిగా అదుపుతప్పి రహదారి మధ్యలో ఉన్న డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది.
కారు డివైడర్‌ను ఢీకొన్న వెంటనే వాహనంలో మంటలు చెలరేగాయి. కొద్దిసేపటికే మంటలు పూర్తిగా కారును చుట్టుముట్టాయి. ప్రమాదం ధాటికి కారు డోర్లు లాక్ కావడంతో డాక్టర్ జగదీశ్ బయటకు వచ్చేందుకు అవకాశం లేకుండా పోయింది. దీంతో మంటల్లో చిక్కుకున్న ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటనను గమనించిన రహదారిపై ప్రయాణిస్తున్న వాహనదారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే అప్పటికే డాక్టర్ జగదీశ్ మంటల్లో చిక్కుకుని మృతి చెందారు.
ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కారు అదుపుతప్పడానికి గల కారణాలు, ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనతో వైద్య వర్గాల్లో విషాదం నెలకొంది.
also read: కరీంనగర్‌లో ఏటీఎంలపై దొంగల దాడి.. గ్యాస్ కట్టర్‌తో రూ.లక్షలు చోరీ
