Homeక్రైమ్కరీంనగర్‌లో ఏటీఎంలపై దొంగల దాడి.. గ్యాస్ కట్టర్‌తో రూ.లక్షలు చోరీ

కరీంనగర్‌లో ఏటీఎంలపై దొంగల దాడి.. గ్యాస్ కట్టర్‌తో రూ.లక్షలు చోరీ

కరీంనగర్ పట్టణంలో ఏటీఎం దొంగలు హల్‌చల్ చేశారు. తెల్లవారుజామున రెండు వేర్వేరు ప్రాంతాల్లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఏటీఎంలను టార్గెట్ చేసిన దుండగులు.. గ్యాస్ కట్టర్లతో మిషన్లను ధ్వంసం చేసి నగదును ఎత్తుకెళ్లారు. ఒకే రాత్రి రెండు చోట్ల చోరీలు జరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్శేడ్, ఎల్‌ఎండీ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మాపూర్ ప్రాంతాల్లో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. దుర్శేడ్‌లోని ఏటీఎంలో తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో కారులో వచ్చిన ఇద్దరు వ్యక్తులు ప్రవేశించినట్లు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు గుర్తించారు. వారిలో ఓ మహిళ ఉన్నట్లు కూడా తెలుస్తోంది.

ఏటీఎంలోకి వెళ్లిన దుండగులు ముందుగా సీసీ కెమెరాలపై ద్రవ పదార్థాన్ని చల్లినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం గ్యాస్ కట్టర్‌ను ఉపయోగించి ఏటీఎం క్యాష్ బాక్స్‌ను ధ్వంసం చేసి నగదును తీసుకెళ్లారు. ఈ ఘటనలో దుర్శేడ్ ఏటీఎం నుంచి సుమారు రూ.8 లక్షలు అపహరణకు గురైనట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయింది. తిమ్మాపూర్ ఏటీఎంలో చోరీకి గురైన నగదు ఎంతన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

దొంగతనం సమయంలో నిందితులు తమ ఆనవాళ్లు, గుర్తింపు బయటపడకుండా టోపీలు, మాస్కులు, కళ్లద్దాలు, గ్లోవ్స్ ధరించినట్లు సీసీటీవీ ఫుటేజీల ద్వారా తెలుస్తోంది. మరోవైపు దుర్శేడ్ ఏటీఎంలో చోరీ జరుగుతున్న సమయంలోనే ఎస్‌బీఐ ఢిల్లీలోని కార్యాలయానికి అలర్ట్ వెళ్లింది. దీంతో బ్యాంకు అధికారులు స్థానిక సిబ్బందిని, పోలీసులను అప్రమత్తం చేశారు.

ఘటనలపై పోలీసులు రెండు వేర్వేరు కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను గుర్తించి పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. ఏటీఎంల వద్ద లభించిన ఆధారాలను సేకరించడంతో పాటు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.

చోరీకి ఉపయోగించిన వాహనానికి మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో నిందితులు ఏ మార్గంలో వెళ్లారనే దానిపై దృష్టి సారించిన పోలీసులు.. ప్రధాన రహదారులు, టోల్ ప్లాజాల వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను కూడా పరిశీలిస్తున్నారు.

ఇటీవలి కాలంలో తెలంగాణలో ఏటీఎంలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. గత మే నెలలో మహబూబ్‌నగర్‌లో కూడా ఇదే తరహాలో ఎస్‌బీఐ ఏటీఎంను గ్యాస్ కట్టర్‌తో ధ్వంసం చేసి సుమారు రూ.2.30 లక్షలు దొంగిలించారు. వరుస ఘటనల నేపథ్యంలో ఏటీఎంల భద్రతపై పోలీసులు, బ్యాంకు అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు.

also read:  ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం తేదీ ఖరారు.. ఎప్పుడంటే?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు