ఉత్తరప్రదేశ్ రాజధాని లఖ్‌నవూలో దారుణ హత్య వెలుగులోకి వచ్చింది. భర్త తన మొదటి భార్యతో సంబంధాలు కొనసాగిస్తున్నాడనే అనుమానంతో రెండో భార్య అతడిని హత్య చేయించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి భార్యతో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం.. రామ్‌కిషోర్ వాల్మీకి అనే వ్యక్తి మొదటి భార్యతో సంబంధాలు కొనసాగించడంపై అతడి రెండో భార్య సుఫియా బానో తరచూ గొడవపడేది. ఈ వ్యవహారం చివరకు హత్యకు దారితీసినట్లు పోలీసులు తెలిపారు.
సెప్టెంబర్ 14-15 మధ్య రామ్‌కిషోర్‌ను సుఫియా బానో తన ప్రియుడు మున్నా, అతడి సహచరుడు ఇక్బాల్‌తో కలిసి హత్య చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అనంతరం మృతదేహాన్ని ఓ పెట్టెలో దాచిన నిందితులు.. ఈ-రిక్షాలో తీసుకెళ్లి కాలువ సమీపంలో పడేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
రామ్‌కిషోర్ కనిపించకపోవడంతో సెప్టెంబర్ 17న అతడి మొదటి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో సుమారు 180 సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి నిందితుల కదలికలను గుర్తించారు.
సీసీటీవీ ఆధారాలతో దర్యాప్తు ముందుకు సాగడంతో సుఫియా బానో, ఆమె ప్రియుడు మున్నా, అతడి సహచరుడు ఇక్బాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
also read: బెంగాల్ లో మమతకు మరో షాక్…!
