పొలం చుట్టూ ఏర్పాటు చేసిన విద్యుత్ కంచె ఓ తొమ్మిదేళ్ల బాలుడి ప్రాణాలను బలిగొంది. ప్రమాదకరంగా విద్యుత్ సరఫరా అవుతున్న కంచెను తాకిన కుక్కను కాపాడేందుకు ప్రయత్నించిన బాలుడు విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. ఈ విషాద ఘటన ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం గార్లపేట గ్రామంలో చోటుచేసుకుంది.
గ్రామానికి చెందిన దేవిరెడ్డి నవీన్ (9) మరో బాలుడితో కలిసి గ్రామ శివారులోని బహిర్భూమికి వెళ్లాడు. వారితో పాటు ఓ కుక్క కూడా ఉంది. ఈ సమయంలో సమీపంలోని పొలం చుట్టూ ఏర్పాటు చేసిన విద్యుత్ కంచెను కుక్క తాకడంతో ఒక్కసారిగా విద్యుత్ షాక్‌కు గురై అక్కడే కుప్పకూలింది.
కుక్కను రక్షించేందుకు నవీన్ దానిని పట్టుకోవడంతో విద్యుత్ ప్రవాహం బాలుడికి కూడా తగిలింది. తీవ్ర విద్యుత్ షాక్‌కు గురైన నవీన్ అక్కడికక్కడే స్పృహ కోల్పోయాడు. ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే బాలుడిని ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించారు.
కనిగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. చిన్నారి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నవీన్ మృతితో గార్లపేట గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
పొలం చుట్టూ ప్రాణాంతకంగా విద్యుత్ కంచె ఏర్పాటు చేసి బాలుడి మృతికి కారణమైన రైతుపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారే విద్యుత్ కంచెల విషయంలో అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
also read: గంజాయి తరలిస్తుండగా పట్టుబడ్డ వ్యక్తి.. 40 కిలోల సరుకు స్వాధీనం
