క్రైమ్ మిర్రర్ : నగరంలోని హఫీజ్‌పేట రైల్వే స్టేషన్లో అత్యంత అమానుష ఘటన వెలుగుచూసింది. పొట్టకూటి కోసం ప్లాస్టిక్ వ్యర్థాలు ఏరుకునే ఒక మహిళపై రైల్వే హోంగార్డు తీవ్ర స్థాయిలో దురహంకారం ప్రదర్శించాడు. బాధితురాలి జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర దుమారం రేపింది. ఓ నిరుపేద మహిళ నిత్యం ప్లాస్టిక్ బాటిళ్లు సేకరించి, వాటిని విక్రయించగా వచ్చే అతి స్వల్ప రాబడితో జీవనం సాగిస్తోంది. ఎప్పటిలాగే నిన్న రాత్రి హఫీజ్‌పేట రైల్వే ట్రాక్ పరిసరాల్లో బాటిళ్లు ఏరుకుంటుండగా, అక్కడే విధుల్లో ఉన్న హోంగార్డు ఆనంద్ ఆమెను అక్కడి నుంచి వెళ్లిపోవాలని కేకలు వేశాడు.
ఈ విషయమై వారిద్దరి మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. కోపంతో రగిలిపోయిన హోంగార్డు ఆనంద్, సదరు మహిళపై భౌతిక దాడికి దిగాడు. మానవత్వం మరచి ఆమె జుట్టు పట్టుకుని దారుణంగా ఈడ్చుకుంటూ వెళ్లాడు. పక్కనే ఉన్న మరో వ్యక్తి ఆ దృశ్యాన్ని చూసి ‘అలా అమానుషంగా చేయవద్దు’ అని ఎంత బతిమిలాడినా హోంగార్డు అస్సలు పట్టించుకోకుండా తన దాష్టీకాన్ని కొనసాగించాడు.
ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా వ్యాపించడంతో ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహజ్వాలలు వ్యక్తమయ్యాయి. దీనిపై సైబరాబాద్ సీపీ రమేష్ రెడ్డి తక్షణమే స్పందించారు. శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన రక్షక భటుడే ఇలా దిగజారి ప్రవర్తించడాన్ని తీవ్రంగా పరిగణించారు. హోంగార్డు ఆనంద్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేయడమే కాకుండా, అతడిని తక్షణమే ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
also read ; ఆరు నెలల పసిపాపపై పిట్‌బుల్ దాడి.. నోట కరుచుకుని ఈడ్చుకెళ్లిన కుక్క
