Homeసినిమాఆస్కార్ రేసులో అనూహ్య ఎంపిక.. ‘ధురంధర్’కు షాక్.. భారత్ తరఫున ఆ మరాఠీ చిత్రమే!

ఆస్కార్ రేసులో అనూహ్య ఎంపిక.. ‘ధురంధర్’కు షాక్.. భారత్ తరఫున ఆ మరాఠీ చిత్రమే!

99వ అకాడమీ అవార్డ్స్‌ (ఆస్కార్‌)లో భారత్ తరఫున అధికారికంగా పోటీ పడే సినిమాపై ఉత్కంఠకు తెరపడింది. వివిధ భారతీయ భాషల్లో రూపొందిన చిత్రాలను పరిశీలించిన ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (FFI) జ్యూరీ.. మరాఠీ థ్రిల్లర్‌ ‘గోంధాల్‌’ను అధికారిక ఎంట్రీగా ఎంపిక చేసింది. దీంతో ఈ రేసులో ఉన్న రణ్‌వీర్‌ సింగ్‌ నటించిన ‘ధురంధర్‌’కు నిరాశ ఎదురైంది.

14 మంది సభ్యులతో కూడిన జ్యూరీ పలు అంశాలను పరిశీలించిన అనంతరం ‘గోంధాల్‌’కు అవకాశం కల్పించింది. ఈ విషయంపై జ్యూరీ సభ్యుడు వివేక్‌ వాస్వానీ మాట్లాడారు. కొంతమంది సభ్యులకు ‘ధురంధర్‌’ నచ్చినప్పటికీ, ఆస్కార్‌ స్థాయికి సరిపోతుందని జ్యూరీ భావించలేదని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా సినిమాలో భారతీయ సంస్కృతి ఆశించిన స్థాయిలో ప్రతిబింబించలేదని తెలిపారు. 14 మంది సభ్యుల్లో నలుగురు మాత్రమే ‘ధురంధర్‌’కు ఓటు వేసినట్లు వెల్లడించారు.

మరోవైపు ‘గోంధాల్‌’కు సంతోష్‌ దవాఖర్‌ దర్శకత్వం వహించడంతో పాటు కథను కూడా అందించారు. మహారాష్ట్రలో అర్ధరాత్రి నిర్వహించే ‘గోంధాల్‌’ సంప్రదాయ ఆచారాలు, జానపద కళల నేపథ్యంతో ఈ థ్రిల్లర్‌ తెరకెక్కింది. భారతీయ సంప్రదాయాలు, స్థానిక సంస్కృతిని కథలో కీలకంగా చూపించడం ఈ చిత్రానికి కలిసొచ్చిన అంశంగా తెలుస్తోంది.

అంతర్జాతీయ స్థాయిలోనూ ‘గోంధాల్‌’కు గుర్తింపు లభించింది. 2025లో జరిగిన 56వ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా (IFFI)లో దర్శకుడు సంతోష్‌ దవాఖర్‌ ఉత్తమ దర్శకుడిగా సిల్వర్‌ పీకాక్‌ అవార్డును అందుకున్నారు. కిషోర్‌ కదమ్‌, ఇషితా దేశ్‌ముఖ్‌, యోగేష్‌ సోహోని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా సంగీతం అందించారు.

ఈ ఏడాది భారత్‌ తరఫున ఆస్కార్‌ ఎంట్రీ కోసం మొత్తం 33 సినిమాలు పోటీ పడ్డాయి. వీటిలో 14 హిందీ, 4 మరాఠీ, 4 తెలుగు, 3 గుజరాతీ, 3 తమిళ చిత్రాలు ఉన్నాయి. మలయాళం, నేపాలీ, నాగాలాండ్‌ నుంచి కూడా ఒక్కో చిత్రం పోటీలో నిలిచింది. చివరి దశకు ‘గోంధాల్‌’, ‘అంగ్‌’, ‘మైనే వాపస్‌ ఆయుంగా’ చేరగా.. తుది ఎంపికలో జ్యూరీ ‘గోంధాల్‌’కు అవకాశం కల్పించింది.

ఆదిత్య ధర్‌ దర్శకత్వంలో రణ్‌వీర్‌ సింగ్‌ నటించిన ‘ధురంధర్‌’ ఫ్రాంచైజీ 2025 డిసెంబర్‌, 2026 మార్చిలో రెండు భాగాలుగా విడుదలై భారీ వసూళ్లు సాధించినప్పటికీ ఆస్కార్‌ ఎంట్రీని దక్కించుకోలేకపోయింది. జ్యూరీ నిర్ణయంతో మరోసారి భారతీయ సినిమా నుంచి అంతర్జాతీయ వేదికపైకి వెళ్లే అవకాశాన్ని ఒక ప్రాంతీయ భాషా చిత్రం దక్కించుకుంది.

also read: స్కూల్‌మెట్ల‌పై నుంచి ప‌డి విద్యార్థిని మృతి…! షాద్‌న‌గ‌ర్‌లో విషాదం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు