క్రైమ్ మిర్రర్ : బాలీవుడ్ నటి అమీషా పటేల్ ఇంట్లో జరిగిన నగల చోరీ కేసులో పోలీసులు ఓ మహిళను అరెస్టు చేశారు. ముంబైలోని చర్చ్‌గేట్ ప్రాంతంలో ఉన్న అమీషా నివాసంలో ఈ ఏడాది జనవరిలో సుమారు రూ.5 లక్షల విలువైన బంగారు ఆభరణాలు కనిపించకుండా పోయాయి. చోరీకి గురైన వస్తువుల్లో వజ్రాలు పొదిగిన బంగారు గాజు కూడా ఉన్నట్లు సమాచారం. ఇంట్లో నగలు కనిపించకపోవడంతో అమీషా తల్లి ఆషా పటేల్ పోలీసులను ఆశ్రయించారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇంట్లో పనిచేసిన సిబ్బంది వివరాలతో పాటు చోరీ జరిగిన సమయంలో అక్కడ ఉన్న పరిస్థితులపై విచారణ చేపట్టారు.
ఈ క్రమంలో అమీషా ఇంట్లో సుమారు ఎనిమిది నెలల పాటు పనిమనిషిగా పనిచేసిన 40 ఏళ్ల సీమా ఘటేగా పోలీసుల అనుమానితుల జాబితాలోకి వచ్చినట్లు తెలుస్తోంది. చోరీ జరిగిన తర్వాత ఆమె అకస్మాత్తుగా పని మానేయడంతో ఆషా పటేల్‌కు అనుమానం మరింత బలపడింది. నగలను తిరిగి ఇచ్చేయాలని, లేదంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని ఆషా పటేల్ ఆమెను హెచ్చరించినట్లు సమాచారం. అయినప్పటికీ ఆభరణాలు తిరిగి రాకపోవడంతో ఆమె పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు.
భారతీయ న్యాయ సంహిత (BNS) నిబంధనల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. చివరకు విరార్ ప్రాంతంలో సీమాను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అనంతరం ఆమెను ముంబై కోర్టులో హాజరుపరచగా.. ఈ నెల 15వ తేదీ వరకు రిమాండ్ విధించినట్లు అధికారులు తెలిపారు.
ప్రస్తుతం చోరీకి గురైన ఆభరణాలను స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కేసులో మరిన్ని వివరాలు దర్యాప్తు పూర్తయిన తర్వాత వెల్లడయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. అమీషా పటేల్ సినీ కెరీర్‌లో ‘గదర్ 2’ చిత్రం కూడా కీలకంగా నిలిచింది. సన్నీ డియోల్‌తో కలిసి ఆమె నటించిన ఈ సినిమా 2023లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా ఆమె ఇంట్లో జరిగిన చోరీ కేసు వార్త బాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
also read : ఒక్కడితో జరిగే పనేనా…?
