-
నేరుగా ఫోన్ చేసి మాట్లాడిన పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్
-
పార్టీలో క్రియాశీలకం కావాలని సూచన
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణ మాజీమంత్రి కొండా సురేఖ విషయంలో విస్తృత చర్చ నడుస్తోంది. మంత్రివర్గం నుంచి తొలగింపు తర్వాత ఆమె కనిపించకుండా మానేశారు. పూర్తి అజ్ఞాతంలోనే ఉన్నారు. ఆమె కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి వేరే పార్టీలో చేరుతారని పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది.
కానీ దానిపై క్లారిటీ లేదు. మరోవైపు సురేఖ బయటకు కనిపించడం లేదు. అసెంబ్లీ సమావేశాలకు కూడా హాజరు కావడం లేదు. కాంగ్రెస్ నేతలతో కూడా ఆమె టచ్ లో లేరు. ఈ క్రమంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ నేరుగా సురేఖకు ఫోన్ చేసి మాట్లాడినట్లు తెలుస్తోంది..
-
కొంతకాలంగా అజ్ఞాతంలోకి..
కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు అన్న ఆరోపణలతో సురేఖ పై వేటు పడింది. ఆమెతోపాటు కుటుంబ సభ్యులు చేసిన వ్యాఖ్యలపై చర్యలకు పట్టుపడుతూ సీఎం రేవంత్ తో పాటు సీనియర్ నేతలు హై కమాండ్ కు వరుసగా విజ్ఞప్తులు చేశారు.
మరోవైపు పార్టీ క్రమశిక్షణ కమిటీ సైతం ఆమెపై చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసింది. దీంతో పార్టీ హై కమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సీఎం రేవంత్ స్పందించారు. ఆమెను మంత్రివర్గం నుంచి తొలగించారు. అటు తరువాత సురేఖ ఆచూకీ లేకుండా పోయింది. ఆమె అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
-
వేరే పార్టీలో చేరలేక..
కొండా దంపతులు పార్టీ మారుతారు అన్న ప్రచారం జోరుగా సాగింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వారు భారతీయ జనతా పార్టీలోకి వెళ్తారన్న టాక్ నడిచింది. ఎందుకంటే ఇప్పటికే గులాబీ పార్టీలో వారు పనిచేశారు. అక్కడ ఇమడలేక కాంగ్రెస్ లోకి వచ్చారు. కెసిఆర్ నాయకత్వాన్ని విభేదించి బయటకు వచ్చేసారు.
అందుకే కొండా దంపతులను మళ్లీ పార్టీలోకి తీసుకునేందుకు గులాబీ పార్టీ నాయకత్వం పెద్దగా ఆసక్తి చూపడం లేదు. వారి ముందు ఉన్న ఏకైక ఆప్షన్ భారతీయ జనతా పార్టీ. కానీ ఆ పార్టీలో సైతం అభ్యంతరాలు వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఏ పార్టీలో చేరలేక కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని సురేఖ ప్రత్యేక ప్రకటన కూడా చేశారు.
-
మీనాక్షి నటరాజన్ ఫోన్
సురేఖ మంత్రి పదవి తొలగింపు తర్వాత.. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. అయితే ఈ సమావేశాలకు మంత్రి సురేఖ గైర్హాజరయ్యారు. ఆమె కనిపించకుండా పోయారు. అయితే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ నేరుగా సురేఖకు ఫోన్ చేసి మాట్లాడినట్లు తెలుస్తోంది.
పార్టీలో యాక్టివ్ గా పాల్గొనాలని సూచించినట్లు సమాచారం. అయితే తనకు అన్యాయం జరిగిందని సురేఖ ఆవేదన వ్యక్తం చేసినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. అయితే జరిగిందేదో జరిగింది.. ఇప్పటికైనా పార్టీలో యాక్టివ్ గా కొనసాగితే మంచి భవిష్యత్తు ఉంటుందని మీనాక్షి నటరాజన్ హితబోధ చేసినట్లు సమాచారం.
కాంగ్రెస్ పార్టీలో నమ్మకంగా కొనసాగితే.. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. మరి దీనిపై ఆమె ఎలా స్పందించారు అన్నది మాత్రం తెలియడం లేదు.
