అక్కినేని నాగ చైతన్య కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘వృషకర్మ’ విడుదల తేదీ ఖరారైంది. కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మైథలాజికల్ థ్రిల్లర్‌ను 2026 డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన కొత్త పోస్టర్‌ను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
‘విరూపాక్ష’ వంటి విజయవంతమైన చిత్రాన్ని అందించిన కార్తీక్ దండు మరోసారి విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో ‘వృషకర్మ’పై ఆసక్తి పెరుగుతోంది. సుకుమార్ రైటింగ్స్ భాగస్వామ్యంతో ఎస్‌వీసీసీ బ్యానర్‌పై ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.
పురాణాలు, మిస్టరీ, థ్రిల్లర్ అంశాలను కలగలిపి ఈ కథను రూపొందిస్తున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. సినిమాలో నాగ చైతన్య ఇప్పటివరకు కనిపించని కొత్త తరహా పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. ఆయనకు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. చైతూ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్నారు.
బాలీవుడ్ నటుడు స్పర్శ్ శ్రీవాస్తవ ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌లో ఆయన కనిపించిన తీరు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది.
సాంకేతికంగా కూడా ‘వృషకర్మ’ను భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. ‘కాంతార’, ‘విరూపాక్ష’ సినిమాలతో తన సంగీతంతో గుర్తింపు తెచ్చుకున్న అజనీష్ లోక్‌నాథ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. రాగుల్ డి హేరియన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. శ్రీ నాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైన్ చేస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, బిహైండ్-ది-సీన్స్ కంటెంట్ సినిమాకు సంబంధించిన ప్రత్యేకమైన ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశాయి. తాజాగా రిలీజ్ డేట్ కూడా ఖరారు కావడంతో త్వరలోనే ప్రమోషన్స్‌ను మరింత వేగవంతం చేసేందుకు చిత్రబృందం సిద్ధమవుతోంది. దేశీయ మార్కెట్‌తో పాటు ఓవర్సీస్‌లోనూ సినిమాను భారీగా ప్రమోట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
విభిన్నమైన కథ, మిస్టరీ-థ్రిల్లర్ అంశాలు, భారీ నిర్మాణ విలువలు, బలమైన సాంకేతిక బృందంతో తెరకెక్కుతున్న ‘వృషకర్మ’ నాగ చైతన్య కెరీర్‌లో ప్రత్యేకమైన చిత్రంగా నిలుస్తుందా? అనేది డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత తేలనుంది.
also read: బ్రిక్స్ సదస్సుకు ఢిల్లీ రెడీ.. ప్రపంచ నేతలకు ఆతిథ్యం ఇవ్వనున్న భారత్
