క్రైమ్ మిర్రర్ : కొండపోచమ్మ రిజర్వాయర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. స్నేహితులతో కలిసి సరదాగా గడిపేందుకు వచ్చిన ఓ కళాశాల విద్యార్థి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన బుధవారం చోటుచేసుకుంది. ములుగు ఎస్సై వి. రఘుపతి తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ ఓల్డ్ బోయినపల్లికి చెందిన నేపాలి మోహన్ ప్రసాద్ (18) బీకాం ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. బుధవారం స్నేహితులతో కలిసి కొండపోచమ్మ రిజర్వాయర్‌ను సందర్శించేందుకు వచ్చాడు.
రిజర్వాయర్‌లోకి దిగిన సమయంలో మోహన్ ప్రసాద్ ప్రమాదవశాత్తు లోతైన ప్రాంతంలోకి వెళ్లి నీటిలో మునిగిపోయాడు. స్నేహితుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. కుటుంబ సభ్యుల సహకారంతో గాలింపు చర్యలు చేపట్టి కొద్దిసేపటి తర్వాత మోహన్ ప్రసాద్ మృతదేహాన్ని నీటి నుంచి వెలికితీశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రఘుపతి తెలిపారు. రిజర్వాయర్‌లోని కొన్ని ప్రాంతాల్లో నీటి లోతు ఎక్కువగా ఉండటంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. సందర్శకులు, ముఖ్యంగా యువత అప్రమత్తంగా ఉండాలని, ప్రమాదకర ప్రాంతాల్లో నీటిలోకి దిగవద్దని సూచించారు.
also read : సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసిన వ్యక్తి.. 9 చోరీలకు పాల్పడి అరెస్ట్
