అటవీ ప్రాంతంలో ఓ మగ ఏనుగు విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందిన ఘటన విషాదాన్ని నింపింది. మంగళంపేట అటవీ ప్రాంతంలోని పాపిరెడ్డిగారిపల్లె సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
స్థానిక సమాచారం ప్రకారం.. సుమారు 13 ఏనుగులతో కూడిన గుంపు ఈ ప్రాంతంలో సంచరిస్తుండగా, అందులోని ఓ మగ ఏనుగు మామిడి తోట వైపు వెళ్లింది. ఆ సమయంలో బోర్‌వెల్ మోటార్‌కు అనుసంధానించిన విద్యుత్ తీగ ఏనుగుకు తగిలి ఉండొచ్చని అటవీశాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. తక్కువ ఎత్తులో విద్యుత్ తీగ ఉండటమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు.
ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం, అటవీశాఖ మంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఏనుగు మృతికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
మృతిచెందిన ఏనుగుకు పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం అటవీశాఖ నిబంధనల ప్రకారం ఖననం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. విద్యుత్ తీగల కారణంగా వన్యప్రాణులకు ప్రమాదాలు జరగకుండా సంబంధిత శాఖలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అధికారులు చెబుతున్నారు.
also read: వృద్ధురాలికి సన్‌గ్లాసెస్ గిఫ్ట్‌గా ఇచ్చిన తమిళనాడు సీఎం విజయ్.. వైరల్‌గా మారిన ఫొటోలు
