-
నిజామాబాద్ సభలో తీవ్ర భావోద్వేగం
-
తనను ఎందుకు జైల్లో పెట్టారో తెలంగాణ సమాజం ఆలోచించుకోవాలని విజ్ఞప్తి
-
గులాబీ పార్టీ పై విరుచుకుపడ్డ తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తెలంగాణలో రక్షణ సేన పేరుతో ప్రత్యేక పార్టీని ఏర్పాటు చేసుకున్న కవిత దూకుడు పెంచారు. నిజామాబాద్ వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఆ సభలో తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు. తాను ఏ తప్పు చేశానని ఢిల్లీలోని బీహార్ జైలులో నిర్బంధించారో యావత్ సమాజం ఆలోచించాలని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్ కోడలిగా.. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి ప్రజల పక్షాన పోరాడిన తనను కక్షపూరితంగానే జైలుకు పంపారని గుర్తు చేశారు. దర్యాప్తు సంస్థలైన ఈ డి, సిబిఐ లు ఎన్ని రకాలు వేధించినా తాను అధైర్య పడలేదని చెప్పుకొచ్చారు. నిప్పులాంటి నిజాయితీ కలిగిన నిజామాబాద్ బిడ్డగా నిలబడ్డానని స్పష్టం చేశారు.
సెంటిమెంట్ అస్త్రం…
Also Read: బిల్లు చెల్లించలేకపోయిన మహిళకు షాకింగ్ శిక్ష.. గుండు కొట్టించిన బార్ యాజమాన్యం
అయితే కవిత ఒక్కసారిగా సెంటిమెంట్ అస్త్రాన్ని బయటకు తీయడం విశేషం. సొంత గడ్డపై కార్యకర్తలు, ప్రజలను చూసినప్పుడు సహజంగానే మనసు బరువెక్కి కన్నీళ్లు వచ్చాయని.. అంతమాత్రాన తాను పిరికిదానిగా భావించవద్దని కవిత పేర్కొన్నారు. జైలు జీవితం వంటి గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నప్పటికీ.. ఏనాడు తన సిద్ధాంతాల నుంచి దారి తప్పలేదని పునరుద్ఘాటించారు. రాజకీయాల్లో తాను చూడని ఉన్నత పదవులు లేవని.. అనుభవించని అధికారం లేదని స్పష్టం చేశారు. ప్రజాసేవ పరమావధిగా తాను ముందుకు సాగుతానని స్పష్టం చేశారు.
గులాబీ పార్టీ కార్నర్…
Also Read: నటుడవ్వాలని కల కూడా కనలేదు.. నెలకు రూ.400 జీతంతో మొదలైన నాజర్ సినీ ప్రయాణం!
మరోసారి గులాబీ పార్టీని కార్నర్ చేశారు కవిత. పార్టీ కోసమే తాను జైలుకు వెళ్లాల్సి వచ్చిందని ఒకప్పుడు చెప్పిన నాయకత్వం.. ఇప్పుడు ఏ కారణంతో తనను పార్టీ నుంచి దూరం పెట్టాలని చూస్తుందో సమాధానం చెప్పాలని కవిత సూటిగా ప్రశ్నించారు. ఇంతటి త్యాగాలు చేసిన తనను పార్టీ నుంచి ఎందుకు బయటకు పంపాల్సి వచ్చిందో ప్రజలకు వివరించాలని నిలదీశారు. తెలంగాణ కోసం ఇంకా చేయాల్సిన బాధ్యతలు, కర్తవ్యాలు ఉన్నందునే గట్టి పట్టుదలతో నిలబడ్డామని.. కేవలం స్వార్ధ పదవుల కోసమే రాజకీయాలు చేయలేదని కవిత స్పష్టం చేశారు. తన రాజకీయ ప్రస్థానంలో ఎలాంటి అడ్డంకులు, కుట్రలు ఎదురైనా ప్రజాక్షేత్రంలోనే ఉండి ప్రజల హక్కుల కోసం చివరి వరకు పోరాటం కొనసాగిస్తానని తేల్చి చెప్పారు. కవిత చేసిన ఈ భావోద్వేగ ప్రసంగం, గులాబీ పార్టీ వైఖరి పై సంధించిన ప్రశ్నలు తెలంగాణ సమాజంలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
