టాలీవుడ్‌లో మరో జంట పెళ్లి బంధంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. ‘బలగం’ సినిమాతో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న కావ్యా కళ్యాణ్‌రామ్, ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి కుమారుడు, గాయకుడు కాలభైరవ త్వరలో వివాహం చేసుకోబోతున్నారు. కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఆ ప్రచారానికి తెరదించుతూ తమ పెళ్లి విషయాన్ని ఈ జంట అధికారికంగా వెల్లడించింది.
ఈ సందర్భంగా కాలభైరవ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కావ్యతో కలిసి గడిపే సమయాన్ని ప్రకృతి అందాలతో, ఆమెతో మాట్లాడటాన్ని చలికాలపు ఉదయాన్నే ఆస్వాదించే కాఫీతో పోలుస్తూ తన ప్రేమను వ్యక్తం చేశారు. ఇకపై జీవితాంతం ఒకే ఇంటిని పంచుకోబోతున్న విషయాన్ని అందరితో పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు.
కావ్యా కళ్యాణ్‌రామ్, కాలభైరవ తమ ప్రేమను పెళ్లి బంధంగా మార్చుకోబోతున్నట్లు ప్రకటించడంతో అభిమానులు, సినీ ప్రముఖులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే వీరి వివాహ తేదీ, వేదికకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడించాల్సి ఉంది.
‘బలగం’ చిత్రంతో కావ్యకు నటిగా మంచి పేరు రాగా.. కాలభైరవ గాయకుడిగా, సంగీత రంగంలో తనదైన గుర్తింపు సంపాదించుకున్నారు. ఇప్పుడు వీరిద్దరూ జీవిత భాగస్వాములుగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో టాలీవుడ్‌లో ఈ జంట పెళ్లి వార్త హాట్‌టాపిక్‌గా మారింది.
also read: యువ నటులు సందీప్ సరోజ్, సాత్విక కొత్త సినిమాకు.. చిరంజీవి ‘వేట’ టైటిల్ ఖరారు
