క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ :- క్రికెట్ మైదానంలో తనదైన క్లాస్ షాట్లు, కళ్లు చెదిరే బౌండరీలు, భారీ సిక్సర్లతో అభిమానులను ఉర్రూతలూగించే టీమిండియా వన్డే, టెస్ట్ కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పుడు మరో కొత్త ఇన్నింగ్స్‌కు సిద్ధమయ్యాడు. ఆటతోనే కాకుండా తనదైన సెన్సాఫ్ హ్యూమర్‌తో ఆకట్టుకునే ఈ ‘హిట్‌మ్యాన్’.. త్వరలో తనలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయనున్నాడు. ఎంటర్టైన్మెంట్ రంగంలోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇస్తూ, ఒక టెలివిజన్ హోస్ట్‌గా సరికొత్త అవతారం ఎత్తనున్నాడు.
ప్రముఖ నెట్వర్క్ సంస్థ ‘సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా’ సరికొత్తగా రూపొందిస్తున్న ఒక మెగా ఎంటర్టైన్మెంట్ షోకి రోహిత్ శర్మ వ్యాఖ్యాతగా (హోస్ట్‌గా) వ్యవహరించనున్నారు. ఈ కార్యక్రమానికి ‘ఫ్యామిలీ ఫుల్ హౌస్ విత్ రోహిత్ శర్మ’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు.
సాధారణంగా ప్రెస్ మీట్స్, ఇంటర్వ్యూలలో తనదైన కామెడీ టైమింగ్, చలోక్తులతో విలేకరులను సైతం నవ్వించే రోహిత్ శర్మ.. ఇప్పుడు ఏకంగా ఒక ఫ్యామిలీ షోను హోస్ట్ చేస్తుండటం సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది. కుటుంబ సమేతంగా ఆస్వాదించేలా వినోదాత్మకంగా ఈ షోను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.
ఈ మోస్ట్ అవైటెడ్ షో సెప్టెంబర్ 19వ తేదీ నుంచి ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రఖ్యాత ‘సోనీ ఎంటర్టైన్మెంట్’ టెలివిజన్ ఛానల్‌తో పాటు, ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘సోనీ లివ్’లో కూడా ఈ కార్యక్రమం ప్రసారం కానుంది. గ్రౌండ్లో బ్యాట్‌తో బౌలర్లపై విరుచుకుపడే రోహిత్, బుల్లితెరపై తన మాటలతో బుల్లితెర ప్రేక్షకులను ఎలా అలరిస్తాడో చూడాలని ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
