చంచల్‌గూడ జైలులో ఓ రిమాండ్ ఖైదీ మృతి చెందడం కలకలం రేపింది. జైలు వాష్‌రూమ్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించిన ఖైదీని సిబ్బంది వెంటనే గుర్తించి ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స కోసం తీసుకెళ్తుండగానే అతడు ప్రాణాలు కోల్పోయాడు.
మృతుడిని “కంది సాగర్ (31)”గా అధికారులు గుర్తించారు. రోడ్డు ప్రమాదానికి సంబంధించిన కేసులో సాగర్ రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఇటీవల అతడిని నిజామాబాద్ జైలు నుంచి చంచల్‌గూడ జైలుకు తరలించినట్లు సమాచారం.
జైలులోని వాష్‌రూమ్‌లో సాగర్ ఉరి వేసుకున్న విషయాన్ని సిబ్బంది గుర్తించారు. వెంటనే అతడిని కిందకు దించి అత్యవసర వైద్యం కోసం ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలోనే పరిస్థితి విషమించి మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
ఈ ఘటనపై జైలు అధికారులు విచారణ ప్రారంభించారు. సాగర్ ఈ అఘాయిత్యానికి పాల్పడటానికి గల కారణాలు ఏమిటి? ఘటనకు ముందు ఏం జరిగింది? అనే అంశాలపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. జైలులో భద్రతా చర్యలు, ఖైదీ పరిస్థితిపై కూడా ఆరా తీస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారుల దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.
also read: రాళ్లతో కొట్టి రౌడీషీటర్ దారుణ హత్య.. జైలు నుంచి వచ్చి కొద్దిరోజులకే దారుణం
