Homeఅంతర్జాతీయంహర్మూజ్‌లో చమురు ఆపేస్తాం.. అమెరికా మిత్రదేశాలకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్

హర్మూజ్‌లో చమురు ఆపేస్తాం.. అమెరికా మిత్రదేశాలకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్

అమెరికా-ఇరాన్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు ముదురుతున్నాయి. తమపై అమెరికా కొనసాగిస్తున్న ఆర్థిక ఒత్తిడికి ఇతర దేశాలు మద్దతు ఇస్తే.. వాటిని కూడా శత్రు దేశాలుగానే పరిగణిస్తామని ఇరాన్ హెచ్చరించింది. అమెరికా ఆంక్షలకు సహకరించే దేశాల ప్రయోజనాలను లక్ష్యంగా చేసుకునే పరిస్థితి రావచ్చని ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ మొహ్సెన్ రెజాయీ స్పష్టం చేశారు.

శనివారం ఓ ప్రభుత్వ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రెజాయీ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాకు సహకరిస్తున్న దేశాలతో ముందుగా దౌత్యపరంగా చర్చలు జరుపుతామని, వివాదానికి దూరంగా ఉండాలని కోరతామని చెప్పారు. అయితే తమ హెచ్చరికలను పట్టించుకోకుండా అమెరికా ఆర్థిక చర్యలకు మద్దతు ఇస్తే.. ఆయా దేశాల ప్రయోజనాలను లక్ష్యంగా చేసుకోవడం తప్ప మరో మార్గం ఉండదని హెచ్చరించారు.

ముఖ్యంగా ఇరాన్‌కు పొరుగు దేశాలు అమెరికా విధిస్తున్న ఆంక్షలు, ఆర్థిక ఆంక్షల అమలులో భాగస్వాములైతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని రెజాయీ పేర్కొన్నారు. అలాంటి పరిస్థితుల్లో హర్మూజ్ జలసంధి నుంచి చమురు రవాణాను అడ్డుకునే చర్యలు చేపట్టే అవకాశం ఉందని స్పష్టం చేశారు. హర్మూజ్ మార్గం ద్వారా ప్రపంచంలోని కీలకమైన చమురు సరఫరా జరుగుతున్న నేపథ్యంలో ఈ హెచ్చరిక అంతర్జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

అమెరికా ఆంక్షలను ఎదుర్కోవడం ఇరాన్‌కు కొత్తేమీ కాదని రెజాయీ అన్నారు. గతంలోనూ అనేక సంవత్సరాల పాటు ఆంక్షలను ఎదుర్కొన్నామని, చమురు విక్రయాలను కొనసాగించే మార్గాలు తమకు తెలుసని ధీమా వ్యక్తం చేశారు.

ఇదిలా ఉంటే.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఇరాన్‌కు ఆర్థికంగా సహకరించే దేశాలపై మరింత కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇచ్చే దేశాలపై తీవ్రమైన ఆర్థిక ఆంక్షలు విధిస్తామని ఆయన ప్రకటించారు. ఈ చర్యను ‘ఎకనామిక్ వార్‌ఫేర్’గా అభివర్ణిస్తూ ట్రంప్ చేసిన ప్రకటనకు ప్రతిస్పందనగానే ఇరాన్ నుంచి తాజా హెచ్చరికలు వచ్చినట్లు తెలుస్తోంది.

ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చీ కూడా అమెరికా చర్యలపై స్పందించారు. గతంలో అమెరికా అమలు చేసిన ‘గరిష్ఠ ఒత్తిడి’ విధానం, కఠినమైన ఆంక్షలు ఆశించిన ఫలితాలను ఇవ్వలేదని ఆయన అన్నారు. తాజాగా చేపట్టిన ఆర్థిక చర్యలు కూడా అదే విధంగా విఫలమవుతాయని పేర్కొన్నారు.

మరోవైపు.. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు జూన్‌లో అమెరికా, ఇరాన్ మధ్య అవగాహన ఏర్పడినప్పటికీ.. తాజాగా ఇరు దేశాల మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. దీంతో భవిష్యత్తులో జరగాల్సిన చర్చలు, తుది ఒప్పందం దిశగా పరిస్థితులు ఎలా మారతాయన్నది ఆసక్తికరంగా మారింది.

ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధిపై ఇరాన్ చేసిన తాజా హెచ్చరికలు అంతర్జాతీయ మార్కెట్లపైనా, అమెరికా-ఇరాన్ సంబంధాలపైనా ప్రభావం చూపే అవకాశముంది.

also read: రవితేజ ‘ఇరుముడి’తో అదిరిపోయే కమ్‌బ్యాక్.. ట్రోలర్లకు స్ట్రాంగ్ కౌంటర్!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు