-మురళికి అపాయింట్మెంట్ ఇవ్వని డిప్యూటీ సీఎం భట్టి
-మరోవైపు ప్రధాన అనుచరుల అరెస్టు
-వదులుకునేందుకు కాంగ్రెస్ హై కమాండ్ నిర్ణయం
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో:- తెలంగాణ కాంగ్రెస్ లో మంత్రి కొండా సురేఖ ఫ్యామిలీ ఎపిసోడ్ రోజుకో మలుపు తిరుగుతోంది. కొండా సురేఖ కుమార్తె చేసిన వ్యాఖ్యల వెనుక కొండా దంపతుల పాత్ర ఉందని హై కమాండ్ కు క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే పార్టీలో ఇప్పుడు కొండా కుటుంబం ఒంటరి అయ్యేలా పరిస్థితి దాపురించింది. కానీ ఇప్పుడు పార్టీలో ఒక వర్గం మద్దతు తమకు ఉందన్న కోణంలో ప్రాజెక్టు చేసే పనిలో ఉన్నారు కొండా కుటుంబం. ఈ పరిస్థితుల్లో కొండా మురళి వేసిన ఎత్తుగడ బెడిసి కొట్టింది. ప్రభుత్వంలో అత్యంత కీలకమైన నేతగా ఉన్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కలిసి.. పార్టీలో తమకు ఆయన పూర్తి మద్దతు ఉందని సంకేతాన్ని హై కమాండ్ కు, ప్రత్యర్థులకు పంపాలని గట్టి ప్రయత్నాలు చేశారు మురళి. కానీ ప్రస్తుత రాజకీయ పరిణామాలు, పార్టీ అంతర్గత సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకొని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆయనకు అపాయింట్మెంట్ ఇచ్చేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది.
అధిష్టానం సీరియస్..
ప్రస్తుతం పార్టీ హై కమాండ్ కొండా కుటుంబం పై సీరియస్ గా ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. ఈ పరిస్థితుల్లో వారితో కలిసేందుకు కూడా ఎవరు ఇష్టపడడం లేదు. ఈ వివాదంలో అనవసరంగా తల దూర్చడం, ఒక వర్గానికి మద్దతుగా నిలిచినట్లు కనిపించడం మంచిది కాదన్న భావనతోనే డిప్యూటీ సీఎం భట్టి ఈ నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కీలక నేతల భేటీకి కూడా అవకాశం లేకుండా పోతోంది. కనీసం మద్దతు ఇచ్చే వారు కూడా కరువవుతున్నారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే మాత్రం కొండా వర్గానికి పెద్ద రాజకీయ ఎదురు దెబ్బ అని చెప్పవచ్చు.
సెటిల్మెంట్లపై ఫోకస్..
మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కొండా కుటుంబానికి సంబంధించిన సెటిల్మెంట్ వ్యవహారాలపై పోలీసుల దర్యాప్తు కూడా అనూహ్య వేగం పుంజుకుంది. మంత్రి సురేఖ మాజీ ఓఎస్డి సుమంత్ డ్రైవర్ను పోలీసులు శనివారం ఉదయమే అదుపులోకి తీసుకునే అరెస్టు చేశారు. పాత వివాదాలు, ఫోన్ సంభాషణలు, తాజా పరిణామాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై సమాచారం రాబట్టేందుకు పోలీసులు ఈ అరెస్టు జరిపినట్లు తెలుస్తోంది. ఈ అరెస్టులతో కొండా ఫ్యామిలీ మరింత బేజారు అవుతున్నట్లు సమాచారం.
వ్యతిరేకులు అధికం..
పైగా కాంగ్రెస్ పార్టీలో కొండా ఫ్యామిలీకి పెద్దగా మద్దతు ఇచ్చేవారు లేరు. వారి వైఖరి పై వ్యతిరేకంగా ఉన్న వారే అధికం. ఒకవేళ మద్దతుగా మాట్లాడాలనుకున్న వారు సైతం ముందుకు రాని పరిస్థితి. ఇదే సమయంలో ప్రభుత్వ పెద్దల నుంచి అపాయింట్మెంట్ లభించకపోవడం.. మరోవైపు సొంత వారి అరెస్టు వారిని కలవరపెడుతోంది. కాంగ్రెస్ హై కమాండ్ కొండా సురేఖ విషయంలో ఒక నిర్ణయానికి వచ్చేసిందని.. సాగనంపడమే తరువాయి అనే టాక్ ఉంది. ఇప్పటికే పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది కాంగ్రెస్ పార్టీలో. క్రమశిక్షణ కట్టు దాటుతోంది. నేతలు వీధుల్లోకి వస్తున్నారు. పార్టీ కట్టు దాటుతున్నారు. ఈ క్రమంలో మంత్రి కొండా సురేఖ పై గట్టి చర్యలు తీసుకోవడం ద్వారా పార్టీ శ్రేణులకు గట్టి సంకేతాలు పంపాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.
