-రేషన్ కార్డుల పై సీఎం రేవంత్, మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఫోటో -కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్ర అభ్యంతరం
-ప్రధాని మోడీ ఫోటో వేయాలంటూ డిమాండ్
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో:- తెలంగాణలో అధికార కాంగ్రెస్, బిజెపి మధ్య కొత్త రాజకీయ యుద్ధానికి తెరలేచింది. కొత్త రేషన్ కార్డుల పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఫోటోలు మాత్రమే ముద్రించడం పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వారి ఫోటోలతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ ఫోటోలు కూడా వేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద రాష్ట్రానికి అవసరమైన మెజారిటీ బియ్యాన్ని, నిధులను కేంద్ర ప్రభుత్వమే సమకూరుస్తున్నప్పుడు.. ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో లేకుండా కేవలం రాష్ట్ర నేతల ఫోటోలు మాత్రమే ముద్రించడం.. రాజకీయ కుట్రగా అభివర్ణిస్తున్నారు కిషన్ రెడ్డి. ఇలానే వ్యవహరిస్తే మహిళా పొదుపు సంఘాల ద్వారా కేంద్రమే నేరుగా రేషన్ పంపిణీ చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. దీంతో ఈ వివాదం మరింత ముదిరే అవకాశం ఉంది.
ఎవరి వాదన వారిదే..
ఈ మొత్తం వ్యవహారంలో క్రెడిట్ వార్ స్పష్టంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు నాణ్యమైన సన్న బియ్యం పంపిణీని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తూ వస్తోంది. ఈ విషయంలో అదనపు ఆర్థిక భారాన్ని తామే భరిస్తున్నామని.. అందుకే ఆ క్రెడిట్ పూర్తిగా తమకే ఉండాలని వాదిస్తోంది. ఇంకోవైపు తెలంగాణలోని సుమారు 55 లక్షలకు పైగా కుటుంబాలకు కేంద్రం వాటా కిందనే ఉచిత బియ్యం అందుతోంది. నిధులు కేంద్రానికి అయితే ప్రచారం మాత్రం రాష్ట్ర ప్రభుత్వాన్నిదా అని బిజెపి నేతలు ప్రశ్నిస్తున్నారు. ఆహార భద్రత కల్పించడంలో ఇరు ప్రభుత్వాల భాగస్వామ్యం ఉన్నప్పటికీ రాజకీయ సమీకరణలను దృష్టిలో పెట్టుకొని.. రాజకీయ లబ్ది పొందేందుకు ఇరుపక్షాలు తాపత్రయపడుతున్నాయి.
నిశితంగా గమనిస్తున్న గులాబీ పార్టీ..
తెలంగాణలో ఒక రకమైన రాజకీయ సమరం కనిపిస్తోంది. కాంగ్రెస్ గులాబీ పార్టీల మధ్య సంప్రదాయ రాజకీయ యుద్ధం ఉంది. కానీ అదే కాంగ్రెస్, బిజెపిల మధ్య మాత్రం క్రెడిట్ కోసం వార్ నడుస్తోంది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో తమ పాత్ర అంటూ తమ పాత్ర ఉంది అని ఇరు రాజకీయ పక్షాలు గట్టిగానే తలపడుతున్నాయి. ఈ క్రమంలో రాజకీయ చలిమంట కాచుకుంటుంది గులాబీ పార్టీ. వాస్తవానికి ప్రజాధనంతో, పన్ను చెల్లింపుదారుల సొమ్ముతో సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయి. అలా ఇస్తున్న సంక్షేమ పథకాల పత్రాలపై అసలు ఏ రాజకీయ నాయకుడి ఫోటోలు ఉండకూడదు అనేది రాజ్యాంగ నిపుణులు, మేధావుల మాట. కార్డులపై కేవలం లబ్ధిదారుడి కుటుంబ వివరాలు, క్యూ ఆర్ కోడ్ వంటి సాంకేతిక అంశాలు మాత్రమే ఉండాలన్న మార్గదర్శకాలు ఉన్నాయి. కానీ అధికార పార్టీలు మాత్రం పొలిటికల్ మైలేజీ కోసం తాపత్రయపడుతున్నాయి.
