కావేరీ నదీ జలాల పంపిణీపై కొనసాగుతున్న వివాదంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ (CWMA) జారీ చేసే నీటి విడుదల ఆదేశాలను కర్ణాటక ప్రభుత్వం తప్పనిసరిగా అమలు చేయాలని స్పష్టం చేసింది. అదే సమయంలో తమిళనాడుకు అందుతున్న నీటి ప్రవాహం, రెండు రాష్ట్రాల్లోని జలాశయాల నిల్వలు, వర్షపాతం తదితర అంశాలపై సమగ్ర నివేదిక సమర్పించాలని అథారిటీని ఆదేశించింది.
తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఆగస్టు 12, 13 తేదీల నుంచి 15 రోజుల పాటు రోజుకు 12 వేల క్యూసెక్కుల చొప్పున తమిళనాడుకు నీటిని విడుదల చేయాలని CWMA ఆదేశించిన అంశంపై ఇరు రాష్ట్రాల తరఫు న్యాయవాదుల వాదనలను కోర్టు పరిశీలించింది.
తమిళనాడు తరఫున సీనియర్ న్యాయవాది సి.ఎస్. వైద్యనాథన్ వాదిస్తూ.. కర్ణాటకలోని జలాశయాల్లో గణనీయమైన నీటి నిల్వలు ఉన్నప్పటికీ, తమ రాష్ట్రానికి రావాల్సిన నీటిలో తక్కువ మొత్తమే విడుదల చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. నీటి కొరత కారణంగా రైతులకు సాగునీరు అందించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. నిబంధనల ప్రకారం తమకు రావాల్సిన నీటిని విడుదల చేసేలా ఆదేశించాలని కోరారు.
మరోవైపు కర్ణాటక తరఫు న్యాయవాది శ్యామ్ దివాన్ వాదిస్తూ.. కావేరీ పరివాహక ప్రాంతంలో నీటి పరిస్థితులు అంత అనుకూలంగా లేనప్పటికీ CWMA ఆదేశాలను పాటిస్తున్నామని తెలిపారు. ఆగస్టు 17 ఉదయం బిలిగుండులు వద్ద నీటి ప్రవాహం 12,607 క్యూసెక్కులకు చేరిందని పేర్కొన్నారు. తమిళనాడు ఆరోపిస్తున్నట్టుగా నీటి విడుదల నిబంధనలను ఉల్లంఘించలేదని స్పష్టం చేశారు.
ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు.. ప్రస్తుతం తమిళనాడుకు కావేరీ నీటి ప్రవాహం అందుతున్నందున తక్షణమే అదనపు ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. అయితే CWMA ఇచ్చిన ఆదేశాలను కర్ణాటక యథావిధిగా అమలు చేయాలని స్పష్టం చేసింది.
అలాగే రెండు రాష్ట్రాల్లోని జలాశయాల నీటి నిల్వలు, వర్షపాతం, హైడ్రోలాజికల్ వివరాలతో కూడిన సమగ్ర నివేదికను సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 24కి వాయిదా వేసింది.
also read: బీహార్ లఖిసరాయ్‌లో విషాదం.. తొక్కిసలాటలో ఏడుగురు భక్తులు మృతి
