క్రైమ్ మిర్రర్ : బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ నివాసం ‘మన్నత్’లో పాములు కనిపించడంతో సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ముంబైలోని బాంద్రాలో ఉన్న మన్నత్ ఆవరణలో సోమవారం రాత్రి రెండు పాములు కనిపించడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించడంతో రెస్క్యూ బృందం అక్కడికి చేరుకుంది.
మెట్ల కింద దాక్కున్న పాము
స్నేక్ క్యాచర్ విక్కీ దూబే, అటవీశాఖ అధికారులతో కలిసి మన్నత్‌కు చేరుకుని పాముల కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో ఆవరణలోని మెట్ల కింద దాక్కున్న ఓ పామును రెస్క్యూ బృందం గుర్తించింది. జాగ్రత్తగా దాన్ని పట్టుకుని పరిశీలించగా అది సుమారు ఎనిమిది అడుగుల పొడవున్న ధమన్ (ఇండియన్ ర్యాట్ స్నేక్)గా గుర్తించారు.
ఈ పాము విషరహిత జాతికి చెందినదని అధికారులు నిర్ధారించడంతో మన్నత్ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం అటవీశాఖ మార్గదర్శకాల ప్రకారం పట్టుకున్న పామును దాని సహజ ఆవాసంలోకి సురక్షితంగా విడిచిపెట్టారు.
రెండో పాము మిస్
మన్నత్ ఆవరణలో మరో పాము కూడా ఉన్నట్లు గుర్తించారు. అయితే రెస్క్యూ సిబ్బంది, ఇతరుల కదలికలు పెరగడంతో అది అక్కడి నుంచి తప్పించుకుంది. దాని కోసం రాత్రి వరకు గాలింపు చేపట్టినప్పటికీ ఆచూకీ లభించలేదు.
సల్మాన్ ఇంట్లో గతంలో..
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నివాసం ‘గెలాక్సీ అపార్ట్మెంట్స్’లోనూ ఈ ఏడాది ప్రారంభంలో పాము కనిపించింది. అప్పట్లో కూడా రెస్క్యూ సిబ్బంది పామును సురక్షితంగా పట్టుకుని అడవిలో వదిలారు. తాజాగా షారుఖ్ ఖాన్ ఇంట్లో రెండు పాములు కనిపించడంతో బాలీవుడ్ ప్రముఖుల నివాసాల్లో పాముల సంచారం చర్చనీయాంశంగా మారింది.
also read : ‘రామాయణం’ బడ్జెట్‌పై హీరో యష్ క్లారిటీ.. రూ.4 వేల కోట్లు దేనికి అంటే?
