క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: ఏపీలో భారతీయ జనతా పార్టీ అనుకున్నంత స్థాయిలో ప్రజల్లోకి వెళ్లడం లేదు. ఆ పార్టీ కార్యకలాపాలు కూడా ఆశించిన స్థాయిలో జరగడం లేదు. ఆ పార్టీలో సీనియర్ నేతలు ఉన్నా.. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఉన్నారు. సాటి తెలుగు రాష్ట్రం తెలంగాణలో దూకుడు ప్రదర్శిస్తున్న ఆ పార్టీ.. ఏపీలో మాత్రం కనీసం ప్రభావం చూపలేకపోతోంది. తెలంగాణలో 8 మంది ఎమ్మెల్యేలు.. 8 మంది ఎంపీలు ఉండగా.. అక్కడ ఆ పార్టీ క్షేత్రస్థాయిలో బలపడుతోంది. 2028 అసెంబ్లీ ఎన్నికలపై గురి పెట్టింది. కానీ ఏపీలో 8 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు ఉండగా.. తెలంగాణ స్థాయిలో మాత్రం ఆ పార్టీ ప్రభావం చూపలేకపోతోంది. దీంతో ఆ పార్టీ శ్రేణులు ఆందోళనతో ఉన్నాయి.
సత్తా చూపలేకపోతున్న మాధవ్…
Also Read:స్వాతంత్య్ర వేడుకల వేళ కాల్పుల కలకలం.. తండ్రీకొడుకుల దారుణ హత్య
ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా యువనేత మాధవ్ ఉన్నారు. ఏడాది కిందట ఆయన పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికలకు ముందు పురందేశ్వరి రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉండేవారు. ఆమె రాజమండ్రి ఎంపీగా ఎంపిక కావడంతో.. రాష్ట్ర అధ్యక్ష పదవి వదులుకోవాల్సి వచ్చింది. ఆమె తరువాత మాధవ్ ఆ బాధ్యతలు స్వీకరించారు. సుదీర్ఘకాలం భారతీయ జనతా పార్టీలో కొనసాగడంతో మాధవ్‌తో ఆ పార్టీకి మరింత మైలేజ్ వస్తుందని ఆశించారు. కానీ ఎందుకో భారతీయ జనతా పార్టీ ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్లలేకపోతోంది ఏపీలో. ఏదో అధికారంలో ఉన్నాం.. పొత్తు లో ఉన్నాం.. కూటమిలో కొనసాగుతున్న అన్నట్టు ఉంది ఆ పార్టీ పరిస్థితి. దీంతో కార్యక్రమాలు లేక.. అండగా నిలబడే నాయకులు లేక ఆ పార్టీ శ్రేణులు పెద్దగా క్రియాశీలకంగా వ్యవహరించలేకపోతున్నారు. పార్టీలో అనుకున్నంత చేరికలు కూడా లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
హేమా హేమీలు ఉన్నా…
Also Read:నేవీ నగర్లో విషాదం.. నావికుడి కుటుంబం అనుమానాస్పద మృతి
మొన్నటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఏపీలో 8 అసెంబ్లీ స్థానాలు వచ్చాయి. పది చోట్ల పోటీ చేస్తే 8 చోట్ల ఆ పార్టీ గెలిచింది. ఆరు ఎంపీ స్థానాలకు పోటీ చేస్తే మూడింట గెలిచింది. కేంద్రమంత్రిగా ఒకరు ఉన్నారు. రాష్ట్ర మంత్రిగా మరొకరు కొనసాగుతున్నారు. రాజమండ్రి ఎంపీగా పురందేశ్వరి గెలిచారు. అనకాపల్లి ఎంపీగా సీఎం రమేష్ విజయం సాధించారు. నరసాపురం నుంచి ఎంపీగా గెలిచిన భూపతి రాజు శ్రీనివాస్ వర్మ కేంద్ర మంత్రి అయ్యారు. ఆపై రాష్ట్ర మంత్రిగా సత్య కుమార్ యాదవ్ ఉన్నారు. ఆ పార్టీలోనే మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి లాంటి నేతలు కూడా ఉన్నారు. గతంలో కేంద్రమంత్రిగా పనిచేసిన సుజనా చౌదరి లాంటి వారు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇంత జరిగిన ఏపీలో మాత్రం బిజెపి బలపడడం లేదు. దానికి కారణం ఏంటనే దానిపై పార్టీలో చర్చ జరగడం లేదు. కనీసం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉనికి చాటుకోవాలన్న ప్రయత్నం కూడా కనిపించడం లేదు. దీనిపైనే ఆ పార్టీ శ్రేణులు ఆందోళనతో ఉన్నాయి. చూడాలి పార్టీ హై కమాండ్ ఎంతవరకు చక్కదిద్దుతుందో…
