ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్‌కు, కర్ణాటక ఎన్నికల అధికారులకు మధ్య ఓటు హక్కు అంశంపై వివాదం మరింత ముదురుతోంది. బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి తన పేరును తొలగించారంటూ ప్రకాశ్ రాజ్ చేసిన ఆరోపణలను అధికారులు ఖండించగా.. తాజాగా వారి వివరణపై నటుడు తీవ్రస్థాయిలో స్పందించారు.
ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గ ఓటర్ల జాబితాలో తన పేరు కనిపించకపోవడంపై ప్రకాశ్ రాజ్ ఇటీవల ఆందోళన వ్యక్తం చేశారు. తాను పుట్టి పెరిగిన, చదువుకున్న బెంగళూరులోనే తన ఓటు లేకపోవడం ఎలా జరిగిందని ప్రశ్నించారు. గతంలో ఇదే ప్రాంతం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన విషయాన్ని కూడా ప్రస్తావించారు.
ప్రకాశ్ రాజ్ పేరును తొలగించలేదన్న అధికారులు
నటుడి ఆరోపణలపై బెంగళూరు నగర పాలక సంస్థ, ఎన్నికల అధికారులు వివరణ ఇచ్చారు. ప్రకాశ్ రాజ్ పేరును ఓటర్ల జాబితా నుంచి తొలగించలేదని స్పష్టం చేశారు. ఆయన పేరుకు ఎదురుగా కేవలం ‘షిఫ్టెడ్’ (నివాసం మారారు) అనే గుర్తింపు మాత్రమే ఉందని తెలిపారు.
విఠల్ మాల్యా రోడ్డులో ఆయన ఓటరుగా నమోదైన చిరునామాలో కొంతకాలంగా నివసించడం లేదని బూత్ స్థాయి అధికారి (BLO) నిర్వహించిన పరిశీలనలో తేలిందని అధికారులు పేర్కొన్నారు. స్థానికులు, భవన యజమాని నుంచి కూడా సమాచారం సేకరించినట్లు తెలిపారు. ప్రస్తుతం వేరే ప్రాంతంలో నివసిస్తున్నట్లు ప్రకాశ్ రాజ్ ఫోన్‌లో అంగీకరించారని అధికారులు వెల్లడించారు. కొత్త చిరునామాను ఓటర్ల జాబితాలో నమోదు చేసుకునేందుకు ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.
అధికారులపై ప్రకాశ్ రాజ్ ఆగ్రహం
అయితే ఎన్నికల అధికారుల వివరణను ప్రకాశ్ రాజ్ తీవ్రంగా ఖండించారు. మొదట తప్పిదం జరిగిందని అంగీకరించి, సమస్యను పరిష్కరిస్తామని చెప్పిన అధికారులు ఇప్పుడు మాట మార్చారని ఆయన ఆరోపించారు.
వివాదం పెద్దదైన తర్వాతే తన పాత చిరునామాకు సంబంధించిన పదజాలాన్ని మార్చి, వివరణ ఇస్తున్నారని ప్రకాశ్ రాజ్ విమర్శించారు. తన చిరునామాలో అధికారులు నిర్వహించిన తనిఖీపై కూడా ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం కేవలం తన వ్యక్తిగత సమస్య కాదని, ప్రజల ఓటు హక్కు, పౌరుల హక్కులకు సంబంధించిన అంశమని పేర్కొన్నారు.
అధికారులు ‘నాటకం ఆడుతున్నారు’, వారి వివరణలో నిజం లేదంటూ ప్రకాశ్ రాజ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంపై మరిన్ని వివరాలతో మళ్లీ మాట్లాడతానని ఆయన వెల్లడించారు.
ఓటర్ల జాబితాలో తన పేరు, చిరునామాకు సంబంధించి అధికారులతో మొదలైన ప్రకాశ్ రాజ్ వివాదం ఇప్పుడు రాజకీయ, సామాజిక వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.
also read: 30 ఏళ్ల తర్వాత డీఎన్‌ఏ టెస్ట్‌తో బయటపడిన బంధం.. స్నేహితురాలే సొంత సోదరి అని తెలిసి!
