-మాజీ మంత్రి చుట్టూ మూడు కేసులతో ఉచ్చు
-తిరుమల దర్శనం టికెట్ల దుర్వినియోగం, ఆడుదాం ఆంధ్ర, -రుషికొండ భవన నిర్మాణం కేసుల్లో..
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో:-
మాజీ మంత్రి రోజా అరెస్ట్ కాబోతున్నారా? ఆమె చుట్టూ ఉచ్చు బిగిస్తోందా? మూడు కీలకమైన కేసులు ఆమె మెడకు చుట్టుకోబోతున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. గత కొద్దిరోజులుగా రోజా అరెస్టుపై రకరకాలుగా ప్రచారం నడుస్తూ వస్తోంది. అయితే ఆమె మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన అవినీతిపై నివేదికలు వచ్చాయి. వాటిపై రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఏ క్షణంలోనైనా రోజా అరెస్టు తప్పదన్న ప్రచారం పొలిటికల్ వర్గాల్లో నడుస్తోంది.
దూకుడు కలిగిన నేత..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దూకుడు కలిగిన నేతల్లో మాజీ మంత్రి ఆర్కే రోజా ఒకరు. ఇప్పటికీ ఆమె దూకుడు అలానే కొనసాగుతూ వస్తోంది. చంద్రబాబుతో పాటు పవన్ విషయంలో అనుచిత వ్యాఖ్యలు చేసేవారు. ఇప్పటికీ మంత్రి లోకేష్ ను టార్గెట్ చేస్తూ వచ్చారు. అయితే గత రెండేళ్లలో రోజా అరెస్టుపై రకరకాల ప్రచారం సాగింది. కానీ మహిళా నేతల విషయంలో కూటమి ప్రభుత్వం పునరాలోచనలో పడినట్లు వార్తలు వచ్చాయి. అయితే రోజా మాత్రం ఏ విషయంలోను వెనక్కి తగ్గడం లేదు. అందుకే ఆమెను టార్గెట్ చేసుకుంటూ పాత కేసులను తిరగదోడాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సరిగ్గా అదే సమయంలో ఆ కీలక కేసులకు సంబంధించిన నివేదికలు.. నాటి ప్రభుత్వ వైఫల్యాలు నిర్ధారణకు రావడంతో ఏ క్షణంలోనైనా రోజా అరెస్టు ఉంటుందన్న టాక్ నడుస్తోంది.
తిరుమల టిక్కెట్లు దుర్వినియోగం..
వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో మంత్రిగా వ్యవహరించారు ఆర్కే రోజా. పర్యాటకశాఖ తో పాటు క్రీడల శాఖ మంత్రిగా ఉండేవారు. అప్పట్లో మంత్రి హోదాలో తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం టికెట్లను దుర్వినియోగం చేశారన్న ఆరోపణ ఆమెపై ఉంది. ప్రతి పర్వదినాన పదుల సంఖ్యలో అనుచరులను వెంటబెట్టుకొని మరి ఆమె తిరుమలలో హల్చల్ చేసేవారు. కొండపైనే రాజకీయాల గురించి మాట్లాడేవారు. అయితే ఆమె సర్వదర్శనాలకు సంబంధించిన టిక్కెట్లు అమ్ముకున్నారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై మీడియాలో సైతం చాలా రకాల కథనాలు వెలువడ్డాయి.
ఆడుదాం ఆంధ్రాలో అవినీతి..
మరోవైపు ఆడుదాం ఆంధ్ర పేరుతో భారీ అవకతవకలకు పాల్పడ్డారు అన్న ఆరోపణలు రోజాపై వచ్చాయి. ఆమె క్రీడల మంత్రిగా ఉన్నప్పుడు క్రీడా పోటీలు నిర్వహించారు. అప్పట్లో ఈ పోటీలకు అవసరమైన క్రీడా పరికరాల కొనుగోలులో 100 కోట్ల రూపాయల వరకు గోల్మాల్ చేశారన్నది ప్రధాన ఆరోపణ. కేవలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులను క్రీడాకారులుగా చూపి భారీగా నిధులు పక్కదారి పట్టించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. క్రీడల శాఖ అధికారులు సిబ్బంది స్థానంలో వలంటీర్లతో క్రీడా పోటీలు నిర్వహించడం.. ఆ పోటీలకు సంబంధించిన నిర్వహణ ఖర్చులను సైతం పక్కదారి పట్టించడం వంటి ఆరోపణలు ఉన్నాయి. క్రీడా పరికరాల సరఫరా బాధ్యతలు అప్పగించే ఏజెన్సీల నుంచి భారీగా వసూళ్లకు పాల్పడ్డారు అన్న ఆరోపణలు కూడా వచ్చాయి. ఆమెతోపాటు అప్పటి శాప్ చైర్మన్గా ఉన్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పై సైతం ఈ ఆరోపణలు రావడంతో కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. విజిలెన్స్ విచారణ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 100 కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు విజిలెన్స్ తేల్చింది. ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది.
అడ్డగోలుగా రుషికొండ భవనాలు..
మరోవైపు తాజాగా రుషికొండ భవనాల విషయంలో సైతం పర్యాటక నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో పర్యాటక శాఖ మంత్రిగా రోజా ఉండేవారు. అప్పట్లో అన్ని ఫైళ్లపై ఆమె సంతకాలు చేశారు. దీంతో ఆమె చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే త్వరలో ఆమె అరెస్టు ఉంటుందన్న ప్రచారం పొలిటికల్ వర్గాల్లో ఉంది. అయితే మహిళా నేతను అరెస్టు చేస్తే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిగా మార్చుకునే అవకాశం ఉంది. అందుకే కేసుల విచారణ పేరుతో ఆమెను నోటీసులు ఇచ్చి తిప్పుతారని తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.
