-
రెంటికి చెడ్డ రేవడిలా కాంగ్రెస్ లో చేరిన గులాబీ పార్టీ శాసనసభ్యులు
-
అధికార పార్టీలో భాగస్వామ్యం లేదు.. అనుకున్న స్థాయిలో నిధులు లేవు
-
గౌరవం లేక ఉక్కపోతకు గురవుతున్న వైనం
-
ముదిరితే రేవంత్ సర్కార్ కు కష్టమే
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: రెంటికీ చెడ్డ రేవడిలా మారిపోయింది కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన గులాబీ పార్టీ ఎమ్మెల్యేల పరిస్థితి. అధికార పార్టీ అని చేరాక అసలు విషయం తెలుస్తోంది. తత్వం బోధపడుతోంది. ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో నిధులు రావడం లేదు. అధికార పార్టీలో గౌరవం ఇవ్వడం లేదు.
దీంతో అందరూ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఉక్కపోతకు గురవుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన దానం నాగేందర్ నుంచి నిజామాబాద్ కు చెందిన సీనియర్ నేత పోచారం శ్రీనివాస్ రెడ్డి వరకు అందరి పరిస్థితి అదే. నియోజకవర్గ అభివృద్ధి నిధుల కోసం, రాజకీయ మనుగడ కోసం.. ఇలా రకరకాల కారణాలతో అధికార పార్టీకి దగ్గరయ్యారు గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు. చేరాక వారికి సరైన గౌరవం దక్కడం లేదు. ముఖ్యమంత్రి, మంత్రుల అపాయింట్మెంట్లు కూడా లభించడం లేదు. దీంతో వీరంతా ఎందుకు చేరామా? అని లోలోపల బాధపడుతున్నారు.
-
అన్నీ ఇబ్బందులే..
గులాబీ పార్టీకి దూరమైన ఈ ఎమ్మెల్యేలు అధికార పార్టీ ముద్ర చూపలేకపోతున్నారు. అధికార పార్టీలో భాగం కాలేకపోతున్నారు. సాంకేతికంగా, చట్టబద్ధంగా, అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకోలేకపోవడమే అందుకు కారణం. ఒకవైపు న్యాయస్థానాల్లో నడుస్తున్న పార్టీ మార్పిడి పిటిషన్లతో అధికారికంగా కాంగ్రెస్లో వీరంతా చేరలేకపోతున్నారు.
కేవలం సీఎంను నిధుల కోసమే కలిసాం అని సాంకేతిక సంజాయిషీలు న్యాయస్థానాలకు ఇస్తున్నారు. మరోవైపు వీరు ఆశిస్తున్నట్టు నిధులు రావడం లేదు. పెండింగ్ నిధులు చెల్లించడం లేదు. దీంతో వీరిని నమ్ముకున్న అనుచరులు అటు గులాబీ పార్టీకి.. ఇటు కాంగ్రెస్ పార్టీ మధ్య నలిగిపోతున్నారు. అధికారికంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే గుర్తింపు రాక.. అటు భారత రాష్ట్ర సమితి పై హక్కు లేక ఫిరాయింపు ఎమ్మెల్యేలంతా రాజకీయంగా రెంటికి చెడ్డ రేవడిలా మారిపోయారు.
-
వ్యూహాత్మక లోపం..
గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు చేరారు సరే. వారికి గౌరవం ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మక లోపం కనిపిస్తోంది. ఒకవేళ అలా చేరిన ఎమ్మెల్యేలకు గౌరవం ఇస్తుంటే నియోజకవర్గాల్లో పాత కాంగ్రెస్ నేతలు తీవ్రహాసం తృప్తికి గురవుతున్నారు. ఖైరతాబాద్ లో దానం నాగేందర్ స్థానిక కాంగ్రెస్ నాయకత్వంతో రోజు ప్రోటోకాల్ యుద్ధాలు చేయాల్సి వస్తోంది.
బాన్సువాడలో పోచారం శ్రీనివాస్ రెడ్డికి కాంగ్రెస్ పాత శ్రేణుల నుంచి సహకారం లభించడం లేదు. ఇలా చెప్పుకుంటే ప్రతి చోటా ఇబ్బందికరమే. సొంత పార్టీ మూల శ్రేణులను నొప్పించకుండా.. వలస ఎమ్మెల్యేలను రక్షణ కల్పించడంలో సరైన వ్యూహం అధికార పార్టీ వద్ద లేదు.
దీంతో హస్తం పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు తమ నిర్ణయం తొందరపాటుగా భావిస్తున్నారు. ఒకవేళ మాతృ పార్టీ నుంచి సరైన పిలుపు వచ్చి.. భవిష్యత్తులో అవకాశాలు ఇస్తామంటే వారంతా యూటర్న్ తీసుకునే అవకాశం ఉంది. అదే జరిగితే కాంగ్రెస్ పార్టీకి భారీ మూల్యం తప్పదు.
-
ఓపెన్ స్టేట్మెంట్లు..
గులాబీ పార్టీ నుంచి కాంగ్రెస్లో ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. తమ మనసులో ఉన్న మాటను బయట పెడుతున్నారు. మేము కెసిఆర్ గారిని మోసం చేయదలుచుకోలేదు.. కేవలం నిధుల కోసమే వచ్చాం కానీ ఇక్కడ పరిస్థితి బాగాలేదు అంటూ పోచారం లాంటి నేతలు బాధపడుతున్నారు.
గులాబీ పార్టీ నుంచి ఇలా బయటకు వచ్చి అలా మళ్లీ మాతృ పార్టీలోకి వెళ్లిపోయారు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. అయితే గులాబీ పార్టీ ఎమ్మెల్యేలను ఆకర్షించడంలో కాంగ్రెస్ వ్యూహాత్మకతప్పిదం స్పష్టంగా కనిపిస్తోంది. చేర్చుకున్న వారికి గౌరవం లభించడం లేదు. కొత్తగా చేరే వారు లేకుండా పోతున్నారు. ఈ అసంతృప్తి ఫిరాయింపు ఎమ్మెల్యేలు పెరిగితే అది అంతిమంగా కాంగ్రెస్ పార్టీకే నష్టం..
