Homeజాతీయంఢిల్లీపై ఉగ్ర ముప్పు.. అలర్ట్ అయిన కేంద్ర ప్రభుత్వం

ఢిల్లీపై ఉగ్ర ముప్పు.. అలర్ట్ అయిన కేంద్ర ప్రభుత్వం

క్రైమ్ మిర్రర్  : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో దేశంలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందంటూ నిఘా వర్గాల నుంచి హెచ్చరికలు రావడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్ఐ ప్రోత్సాహంతో ఉగ్రవాదులు సరిహద్దుల వద్ద లేదా దేశంలోని ఇతర ప్రాంతాల్లో దాడులకు ప్రయత్నించే అవకాశం ఉందని భద్రతా సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఆగస్టు 15న ఢిల్లీ, జమ్మూకాశ్మీర్ సహా కీలక ప్రాంతాల్లో భద్రతా బలగాలు స్వాతంత్ర్య దినోత్సవ ఏర్పాట్లపై దృష్టి పెట్టే అవకాశం ఉండటంతో.. ఆ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ఉగ్రవాద సంస్థలు ప్రయత్నించవచ్చని నిఘా అధికారులు హెచ్చరించినట్లు సమాచారం. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్, బలూచిస్థాన్ ప్రాంతాల్లో నెలకొన్న అంతర్గత సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఐఎస్ఐ తరహా కుట్రలకు పాల్పడవచ్చని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.

జమ్మూకాశ్మీర్, బంగ్లాదేశ్ సరిహద్దులపై ప్రత్యేక నిఘా

జమ్మూకాశ్మీర్‌లోకి ఉగ్రవాదులను చొరబాటుకు ప్రోత్సహించడం, బంగ్లాదేశ్ సరిహద్దు మార్గాల ద్వారా దేశంలోకి ప్రవేశింపజేసే ప్రయత్నాలు జరగవచ్చని భద్రతా సంస్థలకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. అదేవిధంగా భద్రతా వ్యవస్థ కొంత తక్కువగా ఉండే టైర్-2 నగరాలను లక్ష్యంగా చేసుకునే అవకాశాన్ని కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. భద్రతా బలగాల దృష్టిని తప్పుదోవ పట్టించేందుకు ఢిల్లీ లేదా కశ్మీర్‌లో ముప్పు ఉందంటూ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసి, మరో ప్రాంతంలో దాడికి ప్రయత్నించే వ్యూహం ఉండొచ్చని ఓ నిఘా అధికారి పేర్కొన్నట్లు సమాచారం.

పశ్చిమ సరిహద్దులో ‘ఆపరేషన్ అలర్ట్’

భద్రతా హెచ్చరికల నేపథ్యంలో పాకిస్థాన్‌తో ఉన్న పశ్చిమ సరిహద్దులో బీఎస్ఎఫ్ అప్రమత్తతను మరింత పెంచింది. ఆగస్టు 10 నుంచి 17 వరకు ‘ఆపరేషన్ అలర్ట్’ నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ చర్యలను ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తుండగా.. సరిహద్దు ప్రాంతాల్లో నిఘా, గస్తీని విస్తృతం చేశారు. మరోవైపు బంగ్లాదేశ్ సరిహద్దులో కూడా భద్రతను మరింత బలోపేతం చేసేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. పశ్చిమబెంగాల్‌లోని సరిహద్దు జిల్లాల్లో సుమారు 40 సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) యూనిట్లను ఏర్పాటు చేసే ప్రతిపాదనను కేంద్రం పరిశీలిస్తున్నట్లు సమాచారం. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు అత్యంత సున్నితమైన ప్రాంతంగా ఉండటంతో.. చొరబాట్లు, అక్రమ రవాణా, ఇతర అనుమానాస్పద కార్యకలాపాలపై నిరంతర నిఘా కొనసాగించేలా శాశ్వత భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
also read : ఏడాది క్రితమే పెళ్లి.. ఇంతలోనే విషాదాంతం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు