స్వాతంత్య్ర సమరయోధుడు, ఆజాద్ హింద్ ఫౌజ్ నేత నేతాజీ సుభాష్ చంద్రబోస్కు సంబంధించిన అస్థికలను జపాన్లోని రెంకోజీ ఆలయం నుంచి భారత్కు తీసుకురావాలన్న అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై దాఖలైన పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
నేతాజీ కుమార్తె అనితా బోస్ ప్లాఫ్ ఈ పిటిషన్ను దాఖలు చేశారు. తన తండ్రి అస్థికలను భారత దేశానికి తీసుకొచ్చి, ఆయనకు స్వదేశంలో గౌరవప్రదమైన అంత్యక్రియలు నిర్వహించే అవకాశం కల్పించాలని ఆమె కోర్టును కోరారు.
మంగళవారం పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని తెలియజేయాలని ఆదేశించింది. దీంతో నేతాజీ అస్థికలను భారత్కు తరలించే అంశంపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై ఆసక్తి నెలకొంది.
ఇప్పటికీ వీడని నేతాజీ మరణ రహస్యం
నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణం దశాబ్దాలుగా దేశంలో చర్చనీయాంశంగానే ఉంది. 1945లో విమాన ప్రమాదంలో ఆయన మరణించారని ఒక వాదన ఉండగా.. దీనిపై భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. నేతాజీ మరణంపై గతంలో పలు విచారణ కమిషన్లు, కమిటీలు పరిశీలనలు జరిపాయి. అయితే వాటి నిర్ధారణలపై కూడా వివిధ వర్గాల్లో భిన్న అభిప్రాయాలు కొనసాగుతున్నాయి.
జపాన్లోని టోక్యోలో ఉన్న రెంకోజీ ఆలయంలో నేతాజీకి చెందినవిగా భావిస్తున్న అస్థికలు భద్రపరిచినట్లు చెబుతున్నారు. ఇప్పుడు వాటిని భారత్కు తీసుకురావాలన్న డిమాండ్ సుప్రీంకోర్టు వరకు చేరడంతో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది.
కేంద్ర ప్రభుత్వం కోర్టుకు సమర్పించే సమాధానం తర్వాత ఈ వ్యవహారంలో తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది.
also read: ఏడాది క్రితమే పెళ్లి.. ఇంతలోనే విషాదాంతం
