దక్షిణ అమెరికాలోని కొలంబియా దేశంలో సోమవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలు ప్రకారం ఈ భూకంపం తీవ్రత 7.4గా నమోదైంది. ముఖ్యంగా పశ్చిమ కొలంబియా ప్రాంతం తీవ్రంగా దెబ్బతింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 132 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది.
భూకంపం కారణంగా అనేక భవనాలు కుప్పకూలిపోవడంతో పాటు ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. చొకో రీజియన్లోని శాన్ జోస్ డెల్ పాల్మర్ ప్రాంతం వద్ద భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. భూమి లోపల సుమారు 107 కిలోమీటర్ల లోతులో ఈ కంపనలు సంభవించాయని వెల్లడించారు.
ఈ ప్రకంపనల ప్రభావం పొరుగున ఉన్న ఈక్వెడార్ దేశంలో కూడా స్పష్టంగా కనిపించింది. అక్కడ కూడా భవనాలు ఊగిపోవడంతో ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు.
ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు రెస్క్యూ బృందాలు శ్రమిస్తున్నాయి. మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనతో కొలంబియాలో అత్యవసర పరిస్థితిని ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
also read: రాజమహేంద్రవరం ఘటన: మెడికో ప్రియాంక అంత్యక్రియలు పూర్తి… న్యాయం కోసం కుటుంబం ఆవేదన
