భారతీయ పర్యాటకులు, వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు దక్షిణ అమెరికా దేశం అర్జెంటీనా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. భారత్‌తో పర్యాటక, వ్యాపార సంబంధాలను మరింత విస్తరించేందుకు పలు ప్రత్యేక సదుపాయాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఢిల్లీలో నిర్వహించిన ఐకానిక్ టూరిజం సమ్మిట్‌లో భారత్‌లో అర్జెంటీనా రాయబారి మరియానో కాసినో ఈ విషయాలను వెల్లడించారు.
అమెరికా వీసా ఉంటే అర్జెంటీనా వీసా అవసరం లేదు
2025 ఆగస్టు నుంచి అమల్లోకి వచ్చిన నిబంధనల ప్రకారం.. చెల్లుబాటు అయ్యే అమెరికా వీసా ఉన్న భారతీయ పౌరులు ప్రత్యేకంగా అర్జెంటీనా వీసా తీసుకోకుండానే ఆ దేశాన్ని సందర్శించవచ్చని రాయబారి తెలిపారు. ఈ సదుపాయంతో భారతీయులు అర్జెంటీనాలో 90 రోజుల వరకు పర్యటించే అవకాశం ఉంటుంది. భారతీయ పర్యాటకులకు ఇది ప్రయాణాన్ని మరింత సులభతరం చేసే నిర్ణయంగా మారనుంది.
భారతీయులకు ఉచిత బిజినెస్ వీసా
వ్యాపార రంగంలోనూ భారతీయులను ఆకర్షించేందుకు అర్జెంటీనా మరో కీలక ప్రకటన చేసింది. భారతీయ పౌరులకు ఐదేళ్ల కాలపరిమితి కలిగిన బిజినెస్ వీసాను ఉచితంగా అందిస్తున్నట్లు కాసినో వెల్లడించారు. భారతీయ వ్యాపారవేత్తలు అర్జెంటీనాకు వచ్చి వ్యాపార అవకాశాలను అన్వేషించడంతో పాటు పెట్టుబడులు పెట్టాలని ఆయన కోరారు.
విమాన సర్వీసులపై కీలక చర్చలు
భారత్-అర్జెంటీనా మధ్య విమాన ప్రయాణాలను మరింత సులభతరం చేసేందుకు ఇరు దేశాల పౌర విమానయాన శాఖలు ‘ఎయిర్ సర్వీసెస్ అగ్రిమెంట్’పై చర్చలు జరుపుతున్నాయని రాయబారి తెలిపారు. ఈ ఒప్పందం అమల్లోకి వస్తే రెండు దేశాల మధ్య మరిన్ని విమాన మార్గాల్లో సర్వీసులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. విమానయాన సంస్థల మధ్య కోడ్-షేర్ ఒప్పందాలు, పెరిగే పోటీతో టికెట్ ధరలు కూడా తగ్గే అవకాశం ఉందని ఆయన వివరించారు.
డిజిటల్ నొమాడ్ వీసాతో మరో అవకాశం
రిమోట్‌గా పనిచేసే నిపుణులను ఆకర్షించేందుకు అర్జెంటీనా అందిస్తున్న డిజిటల్ నొమాడ్ వీసా గురించి కూడా కాసినో ప్రస్తావించారు. ఈ వీసా ద్వారా విదేశీ నిపుణులు ఆరు నెలల పాటు అర్జెంటీనాలో నివసిస్తూ తమ పని కొనసాగించవచ్చు. అవసరాన్ని బట్టి మరో ఆరు నెలలు పొడిగించుకునే అవకాశం కూడా ఉంది.
భారత్‌కు చెందిన టెక్ నిపుణులు, అర్జెంటీనాలోని స్టార్టప్ వ్యవస్థ మధ్య పరస్పర సహకారం పెరగడానికి ఈ విధానం ఉపయోగపడుతుందని అర్జెంటీనా రాయబారి ఆశాభావం వ్యక్తం చేశారు.
6.5 బిలియన్ డాలర్లు దాటిన ద్వైపాక్షిక వాణిజ్యం
ప్రస్తుతం అర్జెంటీనాకు భారత్ ఆరో అతిపెద్ద ఆర్థిక భాగస్వామిగా ఉంది. 2025లో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 6.5 బిలియన్ డాలర్లను దాటింది. ఇంధనం, ఆహార భద్రత వంటి కీలక రంగాల్లో భారత్-అర్జెంటీనా సంబంధాలకు వ్యూహాత్మక ప్రాధాన్యత ఉందని కాసినో పేర్కొన్నారు.
పర్యాటక రంగంలో పరస్పర రాకపోకలు పెరగడం ద్వారా ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని ఆయన అన్నారు. భారతీయ పర్యాటకులు, వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులకు మరిన్ని అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా అర్జెంటీనా ఈ చర్యలను చేపడుతున్నట్లు తెలిపారు.
also read: దీన్‌దయాళ్ ఆలోచనలే అభివృద్ధికి మార్గదర్శకం.. ప్రధాని మోదీ
