సామాజిక, రాజకీయ అంశాలపై తన అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తం చేసే నటుడు సిద్ధార్థ్ మరోసారి వార్తల్లో నిలిచారు. విద్యార్థుల ఆందోళనలకు మద్దతు తెలిపినందుకు వస్తున్న విమర్శలపై ఆయన గట్టిగా స్పందించారు. ప్రజలకు సంబంధించిన విషయాలపై మాట్లాడటం తన హక్కు అని స్పష్టం చేస్తూ, ఎలాంటి అనుమతి అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు.
ఇటీవల విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో, ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనలకు పలువురు సినీ ప్రముఖులు మద్దతు తెలిపారు. ఈ జాబితాలో సిద్ధార్థ్‌తో పాటు నటి దియా మీర్జా కూడా ఉన్నారు. అయితే, ఈ మద్దతుపై కొన్ని వర్గాల నుంచి విమర్శలు రావడంతో సిద్ధార్థ్ తన వైఖరిని క్లియర్ చేశారు.
ప్రస్తుతం ‘ఆపరేషన్ సఫేద్ సాగర్’ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న ఆయన మాట్లాడుతూ… “నేను మాట్లాడటం ప్రారంభించినప్పుడు ఎవరి అనుమతి తీసుకోలేదు. ఇక ముందు కూడా తీసుకునే అవసరం లేదు” అని స్పష్టం చేశారు. తన అభిప్రాయాన్ని వెల్లడించడం ఒక పౌరుడిగా తన హక్కు అని ఆయన తెలిపారు.
విద్యార్థుల సమస్యలపై స్పందిస్తూ, పరీక్షా పత్రాల లీకేజీలు, విద్యా వ్యవస్థలోని లోపాలు యువత భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని సిద్ధార్థ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇవి కేవలం వ్యక్తిగత సమస్యలు కాకుండా దేశ భవిష్యత్తుతో ముడిపడి ఉన్న అంశాలని ఆయన అభిప్రాయపడ్డారు.
అలాగే, సమాజంలో ప్రతి ఒక్కరికీ బాధ్యత ఉందని, విద్యార్థుల సమస్యలను నిర్లక్ష్యం చేయకూడదని సూచించారు. సినీ నటులు కూడా సమాజంలో భాగమేనని గుర్తుచేసిన ఆయన… వారు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడం సహజమేనని పేర్కొన్నారు.
వ్యక్తిగత అభిప్రాయాలపై ద్వేషం ప్రదర్శించడం సరికాదని నెటిజన్లకు సూచిస్తూ, ఆరోగ్యకరమైన చర్చలు జరగాలని సిద్ధార్థ్ కోరారు.
also read: మహేష్ బాబు బర్త్‌డే స్పెషల్.. ‘వారణాసి’పై ప్రియాంక చోప్రా క్రేజీ పోస్ట్ వైరల్!
