హైదరాబాద్‌లో బోనాల పండుగ ఉత్సాహం ఊపందుకుంది. నగరమంతా ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడుతుండగా, అమ్మవారి ఆలయాలు భక్తులతో నిండిపోయాయి. ముఖ్యంగా పాతబస్తీ ప్రాంతంలోని ప్రసిద్ధ లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయం భక్తజన సందోహంతో కిక్కిరిసిపోయింది.
ఈ సందర్భంగా ప్రముఖ సినీ నటుడు విజయ్ దేవరకొండ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయనతో పాటు తన సోదరుడు ఆనంద్ దేవరకొండ, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కూడా ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముగ్గురూ కలిసి అమ్మవారికి మొక్కులు చెల్లించి ఆశీస్సులు పొందారు.
విజయ్ దేవరకొండ ఆలయానికి రావడంతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా ఉత్సాహభరితంగా మారింది. అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకుని తమ అభిమాన హీరోను చూసేందుకు ఆసక్తి చూపారు. దర్శనం అనంతరం బయటకు వచ్చిన ఆయనను చూసేందుకు అభిమానులు తాకిడి చేయడంతో కొద్దిసేపు కోలాహలం నెలకొంది.
ప్రతి ఏడాది జరిగే బోనాల ఉత్సవాల్లో సామాన్య ప్రజలతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందడం ప్రత్యేకతగా నిలుస్తోంది. ఈ ఏడాది కూడా అదే ఉత్సాహం కొనసాగుతోంది.
also read: రవితేజ ‘ఇరుముడి’ ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్.. భీమవరంలో గ్రాండ్ ఈవెంట్!
