కర్ణాటక రాష్ట్రంలోని మైసూరులో పని ప్రదేశంలో వేధింపుల ఆరోపణల మధ్య ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఉద్యోగ బాధ్యతల పేరుతో నెలల తరబడి ఒత్తిడి, సెలవుల నిరాకరణ, మానసిక వేధింపులు ఎదుర్కొన్నట్టు ఆమె రాసిన సూసైడ్ నోట్ బయటకు రావడంతో ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.
మృతురాలు నాగేశ్వరి మైసూరులోని ఓ రిటైల్ మార్ట్‌లో పనిచేసేది. ఆమె పీపీఎంఎస్ అనే మార్కెటింగ్ సంస్థ ద్వారా ఈ ఉద్యోగంలో చేరినట్లు సమాచారం. అయితే, గత కొన్ని నెలలుగా తనపై పైఅధికారులు లక్ష్యంగా పెట్టుకుని వేధింపులకు పాల్పడుతున్నారని నాగేశ్వరి తన సూసైడ్ నోట్‌లో పేర్కొంది.
తన తప్పు లేకపోయినా చిన్న విషయాలకే తప్పుబట్టడం, అనవసరంగా ఒత్తిడి చేయడం జరుగుతుందని ఆమె తెలిపింది. ముఖ్యంగా నాలుగు నెలలుగా ఒక్కరోజు కూడా సెలవు ఇవ్వకుండా నిరంతరం పని చేయించారని, అత్యవసర పరిస్థితుల్లో కూడా సెలవులను నిరాకరించారని ఆవేదన వ్యక్తం చేసింది. వారానికి ఒకరోజు కూడా విశ్రాంతి లేకపోవడం తనపై తీవ్ర ప్రభావం చూపిందని ఆమె లేఖలో పేర్కొంది.
తనను ఎందుకు ఇలా వేధిస్తున్నారో ప్రశ్నించినందుకు ఉద్యోగం నుంచి తొలగించారని నాగేశ్వరి ఆరోపించింది. ఈ పరిణామాలన్నీ తనను మానసికంగా కుంగదీసి, చివరకు ఈ దారుణ నిర్ణయం తీసుకునే పరిస్థితికి నెట్టాయని ఆమె సూసైడ్ నోట్‌లో పేర్కొనడం కలకలం రేపుతోంది.
ఇదిలా ఉండగా, నాగేశ్వరి మృతిపై ఆమె తల్లి రత్నమ్మ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. “నా కూతురు పని చేసే చోట మానసిక వేధింపులకు గురైంది. చిన్న చిన్న కారణాలతో ఆమెను ఇబ్బంది పెట్టేవారు. గత 15 రోజులుగా ఆమె తీవ్రంగా కలత చెందింది. వేధింపుల గురించి మాతో చెప్పింది. ఆత్మహత్యకు ముందు తన సూపర్‌వైజర్ పేరును కూడా లేఖలో ప్రస్తావించింది. నా కూతురికి న్యాయం చేయాలి” అంటూ కన్నీరుమున్నీరయ్యారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకునే దిశగా విచారణ కొనసాగుతోంది. ఈ సంఘటనతో పని ప్రదేశాల్లో ఉద్యోగులపై మానసిక ఒత్తిడి, వేధింపుల అంశం మరోసారి వెలుగులోకి వచ్చింది.
also read: అత్త హత్య కేసులో అల్లుడు అరెస్ట్.. తెరపైకి సంచలన ఆరోపణలు!
