గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్‌లో మానవత్వాన్ని కలచివేసే ఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబంలోని గొడవల నేపథ్యంలో ఓ తండ్రి తన కన్న కూతురుపై అమానుషానికి పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు దారితీసింది.
పోలీసుల సమాచారం మేరకు, 32 ఏళ్ల వ్యక్తి తన భార్య స్నేహితురాలిపై అసభ్యంగా ప్రవర్తించినట్టు తెలిసింది. ఈ విషయంపై భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకోగా, మనస్తాపానికి గురైన భార్య తన పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది.
కొన్ని రోజుల తర్వాత ఆ వ్యక్తి అత్తమామల ఇంటికి వెళ్లి పిల్లల్లో ఒకరిని తనతో పంపాలని కోరాడు. కుటుంబ సభ్యులు తొలుత నిరాకరించినప్పటికీ, చివరికి నాలుగేళ్ల కుమార్తెను అతనితో పంపించారు. అనంతరం ఇంటికి తీసుకెళ్లిన నిందితుడు రాత్రి సమయంలో చిన్నారిపై దారుణానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.
చిన్నారి నొప్పితో ఏడవడంతో అతను తన చర్యను ఆపినట్లు తెలుస్తోంది. మరుసటి రోజు ఉదయం పాపకు స్నానం చేయిస్తుండగా గాయాల గుర్తులు గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అప్రమత్తమయ్యారు. బాలికను ఆసుపత్రికి తరలించగా, వైద్య పరీక్షల్లో లైంగిక దాడి జరిగినట్లు నిర్ధారణ అయ్యింది.
బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి, పోక్సో చట్టం కింద నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
also read: పసికందును ఎత్తుకెళ్లిన వాచ్ వుమెన్… 3 గంటల్లోనే కేసు చేధించిన పోలీసులు
