- ఎఫ్‌సీఎల్ ట్రైనింగ్‌లో మెరుపులు – యుద్ధ మిషన్లకు నాయకత్వం వహించే అర్హత సాధించిన భావనా
భారత వాయుసేన (IAF)లో మరో చారిత్రాత్మక ఘట్టం నమోదైంది. స్క్వాడ్రన్ లీడర్ భావనా కాంత్ ప్రతిష్ఠాత్మకమైన ఫైటర్ కంబాట్ లీడర్ (FCL) కోర్సును విజయవంతంగా పూర్తి చేసి, ఈ ఘనత సాధించిన తొలి మహిళా ఫైటర్ పైలట్‌గా నిలిచారు. వాయుసేనలో అత్యంత కఠినమైన శిక్షణగా భావించే ఈ కోర్సును సాధారణంగా ‘టాప్ గన్’ ప్రోగ్రామ్‌గా పిలుస్తారు.
ఈ కోర్సు పూర్తి చేయడం ద్వారా భావనా కాంత్ అత్యంత క్లిష్టమైన యుద్ధ విమాన ఆపరేషన్లు నిర్వహించడం మాత్రమే కాకుండా, వాటికి నాయకత్వం వహించే స్థాయికి ఎదిగారు. ఇది ఆమె కెరీర్‌లోనే కాదు, భారత సాయుధ దళాల చరిత్రలో కూడా ఒక ముఖ్యమైన మైలురాయి.
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఉన్న టాక్టిక్స్ అండ్ ఎయిర్ కంబాట్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (TACDE)లో ఈ ప్రత్యేక శిక్షణ అందించబడుతుంది. సుమారు 20 వారాల పాటు సాగే ఈ కోర్సులో అత్యున్నత స్థాయి యుద్ధ వ్యూహాలు, మిషన్ ప్రణాళిక, గగనతల యుద్ధ పద్ధతులు, క్లిష్ట పరిస్థితుల్లో నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం వంటి అంశాల్లో కఠిన శిక్షణ ఇస్తారు. వాయుసేనలో అత్యుత్తమ పైలట్లలో కొద్దిమందికే ఈ అవకాశమొస్తుంది.
బిహార్‌లోని దర్భంగా ప్రాంతానికి చెందిన భావనా కాంత్, ఇంజినీరింగ్‌లో పట్టభద్రురాలు. 2016లో భారత వాయుసేనలో చేరిన తొలి మహిళా ఫైటర్ పైలట్ల బ్యాచ్‌లో ఆమె ఒకరు. అవనీ చతుర్వేది, మోహనా సింగ్‌లతో కలిసి ఆమె సేవలోకి ప్రవేశించారు.
తన కెరీర్‌లో భావనా కాంత్ ఇప్పటికే పలు కీలక విజయాలు సాధించారు. 2019లో పగటి సమయంలో యుద్ధ విమానాన్ని నడిపిన తొలి మహిళా పైలట్‌గా గుర్తింపు పొందారు. మిగ్-21 బైసన్‌తో తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఆమె, తర్వాత సుఖోయ్-30 ఎంకేఐ ఫైటర్ జెట్‌ను కూడా నడిపారు. గణతంత్ర దినోత్సవ పరేడ్‌లు, వైమానిక ప్రదర్శనల్లో పాల్గొని తన ప్రతిభను చాటుకున్నారు.
భావనా కాంత్ సాధించిన ఈ విజయాన్ని నిపుణులు మహిళల సాధికారత దిశగా కీలక అడుగుగా అభివర్ణిస్తున్నారు. సాయుధ దళాల్లో మహిళలు పోరాట మరియు నాయకత్వ పాత్రల్లో ముందుకు వస్తున్నారనే విషయానికి ఇది స్పష్టమైన ఉదాహరణగా నిలుస్తోంది.
also read: కర్నూలులో టీడీపీ కార్యకర్త దారుణ హత్య.. ఇద్దరు అనుమానితులు అదుపులోకి
